ఒక పరామర్శ.. వంద సమాధానాలు..
జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే ఘాటు విమర్శలు కూడా వినిపించాయి. ఆ విమర్శలన్నింటికీ ఒకే ఒక్క పర్యటనతో చెక్ పెట్టేశారు సీఎం జగన్.
మూడేళ్ల క్రితం జగన్ వేరు, ఈ మూడేళ్లలో జనం చూసిన జగన్ వేరు. అప్పట్లో ఎన్నికల పాదయాత్రలో జగన్ జనంతో మమేకం అయ్యారు. రైతన్నల భుజంపై చేయి వేసుకుని నడిచారు. అక్కచెల్లెమ్మలను అక్కున చేర్చుకుని ఆశీర్వదించేవారు. కానీ ఈ మూడేళ్లలో సీఎం హోదాలో ఉండటం వల్ల జనాలకు మరీ అంత దగ్గరగా రాలేకపోయారు జగన్. ఆమాటకొస్తే ఆయన జనంలోకి వచ్చింది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ మరీ ఎక్కువగా ఉండటం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇటీవల పులివెందుల పర్యటనలో కూడా జగన్ పరదాల మాటున ఉన్నారని, బ్యారికేడ్లు అడ్డు పెట్టుకుని జనాలకు దూరంగా ఉండిపోయారని విపక్షాలు విమర్శలు చేశాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే ఘాటు విమర్శలు కూడా వినిపించాయి. ఆ విమర్శలన్నింటికీ ఒకే ఒక్క పర్యటనతో చెక్ పెట్టేశారు సీఎం జగన్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదపూడిలో పర్యటించిన సీఎం జగన్, సరిగ్గా మూడేళ్ల క్రితం జనం చూసిన జగన్ లా మారిపోయారు. ఎక్కడా సెక్యూరిటీ అడ్డంకుల్లేవు, జగన్ నేరుగా జనం వద్దకు వచ్చారు. వారితో మాట్లాడారు, రైతన్నల భుజంపై చేయి వేసి ముందుకు నడిచారు. తన స్టైల్ బూట్లు వేసుకుని మరీ జనంలోకి వచ్చారు. సరిగ్గా ప్రజా సంకల్ప యాత్రలో జనం ఎలాంటి జగన్ ని చూశారో.. మూడేళ్ల తర్వాత అలాంటి జగన్ జనంలోకి వచ్చారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకే జగన్ స్టైల్ మార్చారని అంటున్నారు.
సీఎం హోదా వల్ల ఇటీవల కాస్త జనాలకు దూరం కావాల్సి వచ్చింది కానీ, లోపల ఒరిజినల్ అలాగే ఉన్నానని పరోక్షంగా హింట్ ఇచ్చారు జగన్. జనంలో ఆయన కలసిపోయిన తీరు, పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన తీరు చూస్తుంటే పాత జగన్ గుర్తొస్తున్నారని వైసీపీ నాయకులే అంటున్నారు. ఇటీవల పదే పదే జగన్ ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. గడప గడపకు తిరగాల్సిందేనంటున్నారు. ప్రజల్లోకి వెళ్లకపోతే ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎంత ఆర్థిక సాయం చేసినా ఓట్లు పడవని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రజల్లోకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.