Telugu Global
Andhra Pradesh

ఆ ఎస్సైకి జగన్ అభినందన.. ఏడాది ఆలస్యం

ఏడాది తర్వాత ఆ ఎస్సై చేసిన మంచి పనికి ప్రశంసలు దక్కాయి. బోనస్ గా పోలీస్ అవార్డు కూడా వరించబోతోంది. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగా అయినా వెంకటేష్ వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా చేయలేని పని, స్థానికులు చేసి పెట్టారు.

ఆ ఎస్సైకి జగన్ అభినందన.. ఏడాది ఆలస్యం
X

ఏ చిన్న పని చేసినా దాన్ని గొప్పగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం చాలామందికి అలవాటు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా ఇది తప్పనిసరిగా మారింది. పని చేయడం ఒక్కటే కాదు, సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టుకుంటేనే పుణ్యం, పురుషార్ధం రెండూ దక్కుతాయి. పాపం ఆ పని తెలియక ఓ ఎస్సై ఏడాదిగా అభినందనలకు దూరంగా ఉండిపోయారు. కాస్త ఆలస్యంగా అయినా ఆయనకు కాలం కలిసొచ్చింది. నేరుగా సీఎం జగన్ ఆ ఎస్సైని అభినందించారు. భుజం తట్టి ప్రోత్సహించారు, పోలీస్ మెడల్ కి సిఫార్సు చేశారు.

కూనవరం ఎస్సై వెంకటేష్ గతేడాది గోదావరి వరదల్లో రెస్క్యూ ఆపరేషన్ లో చురుగ్గా పాల్గొన్నారు. కింది స్థాయి సిబ్బందికి సూచనలివ్వడంతోపాటు, తానే స్వయంగా రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 4వేలమంది లోతట్టు ప్రాంతాలనుంచి బయటపడ్డారు. కానీ అప్పట్లో ఆయనకు ఆ స్థాయిలో ప్రచారం దక్కలేదు. ప్రచారం లేకపోయినా స్థానికులు ఆయన చేసిన సేవల్ని మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఈరోజు సందర్భం రాగానే సీఎం జగన్ వద్ద తమ ఎస్సై వెంకటేష్ గురించి గొప్పగా చెప్పారు. తమ ప్రాణాలు కాపాడారంటూ ఆకాశానికెత్తేశారు.


ప్రస్తుత వరదల పరామర్శకు వచ్చిన సీఎం జగన్, గతంలో వచ్చిన వరదల్లో ఎస్సై వెంకటేష్ చేసిన సాహసాలను విని ఆశ్చర్యపోయారు. భుజం తట్టి అభినందించారు. ఆయనకు పోలీస్ మెడల్‌ ఇవ్వాలంటూ అధికారులకు సిఫార్సు చేశారు. అలా ఏడాది తర్వాత ఆ ఎస్సై చేసిన మంచి పనికి ప్రశంసలు దక్కాయి. బోనస్ గా పోలీస్ అవార్డు కూడా వరించబోతోంది. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగా అయినా వెంకటేష్ వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా చేయలేని పని, స్థానికులు చేసి పెట్టారు.

First Published:  7 Aug 2023 10:33 PM IST
Next Story