Telugu Global
Andhra Pradesh

మేం వచ్చి 2 నెలలే.. దీనికి కారణం వారే

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందని గుర్తు చేశారు చంద్రబాబు. విమర్శలు చేసేవారు శవాలమీద చిల్లర ఏరుకునే రకం అని విమర్శించారు.

మేం వచ్చి 2 నెలలే.. దీనికి కారణం వారే
X

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదానికి కొత్త ప్రభుత్వం కారణం కాదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. వైసీపీ తప్పుడు పనులు చేసి తమను విమర్శిస్తోందని మండిపడ్డారు. వారి చేతగానితనమే ప్రమాదానికి కారణం అన్నారాయన. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పుల వల్లే ఇప్పుడీ ప్రమాదం జరిగిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందని గుర్తు చేశారు చంద్రబాబు. ఈ ఘటనకు కారణం ఎవరని ప్రశ్నించారు. వారు శవాలమీద చిల్లర ఏరుకునే రకం అని విమర్శించారు. విశాఖ పట్నంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం సెజ్‌ ఘటన క్షతగాత్రులను సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించారు.


ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలై 17మంది ఇప్పటికే చనిపోయారు. 36మంది గాయాలతో బయటపడ్డారు. వీరిలో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సీరియస్ గా ఉంది. 26మందికి ప్రాణాపాయం లేదు. క్షతగాత్రులను ఈరోజు సీఎం చంద్రబాబు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా ఉండాలని, వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని చెప్పారు. వైద్యులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు.

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామన్నారు సీఎం చంద్రబాబు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. దాని పర్యవసానమే ఈ ప్రమాదం అని చెప్పారు చంద్రబాబు.

First Published:  22 Aug 2024 9:12 AM GMT
Next Story