అప్పులు పెరిగాయి, ఆదుకోండి..
2019-20లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 31.02 శాతం మాత్రమే ఉండగా, 2023-24లో అవి 33.32 శాతానికి పెరిగాయని చెప్పారు సీఎం చంద్రబాబు.
ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని, కేంద్రం ఆదుకోవాలని, ఆర్థిక కష్టాల్లోనుంచి బయటపడేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై ఆమెకు మెమొరాండం అందించారు. ఏపీకి నిధులు పెంచాలని అందులో కోరారు, పెంచాల్సిన అవసరం ఏముందో కూడా ప్రత్యేకంగా వివరించారు. దాదాపు గంటసేపు ఈ భేటీ జరిగింది.
Met with the Hon'ble Minister of Finance and Corporate Affairs, @nsitharamanoffc Ji, in Delhi today to discuss welfare and economic development in Andhra Pradesh and to further our collaboration. https://t.co/de5fPueIBr
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2024
2019-20లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 31.02 శాతం మాత్రమే ఉండగా, 2023-24లో అవి 33.32 శాతానికి పెరిగాయని చెప్పారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగాయని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని కూడా కోరారు చంద్రబాబు. పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కూడా ఆయన అడిగారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్రమంత్రి నిర్మల సానుకూలంగా స్పందించారని టీడీపీ వర్గాలంటున్నాయి. వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని ఆమె తెలిపినట్టు చెప్పారు టీడీపీ నేతలు.
ఢిల్లీ పర్యటన మొదటి రోజు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలసిన చంద్రబాబు.. రెండోరోజు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, రామ్‌దాస్ అథవాలెతో భేటీ అయ్యారు. ఈరోజు బిజీ షెడ్యూల్ అనంతరం ఆయన హైదరాబాద్ కు బయలుదేరుతారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అవుతారు.