జగన్ తో పాటు మా కాపురాలు కూడా అక్కడే..
సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ పరిపాలన జరుగుతుందని, సీఎం జగన్ విశాఖ రాకను ఎవరూ అడ్డుకోలేరన్నారు మంత్రి అమర్నాథ్.
సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే అంటూ శ్రీకాకుళం జిల్లా సభలో ప్రకటించారు సీఎం జగన్. విశాఖ పాలనా రాజధానిగా సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని హింటిచ్చారు. అయితే టీడీపీ నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే జగన్, విశాఖ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. దీనికి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. సెప్టెంబర్ నుంచి సీఎం జగన్ తోపాటు, మంత్రులందరి మకాం కూడా విశాఖకే మారిపోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
కొత్త విషయం కాదు కదా..!
మూడు రాజధానుల ప్రకటన తర్వాత సీఎం జగన్ సహా, మంత్రులంతా విశాఖకు తరలిపోవాల్సిందేనని, అయితే ఆ తరలింపు ఎప్పుడనే విషయంపై ఇప్పటి వరకూ సందిగ్ధం ఉండేదని, సెప్టెంబర్ ముహూర్తాన్ని జగన్ ప్రకటించిన తర్వాత ఇక ఆలోచించాల్సిన అవసరమేముందన్నారు మంత్రి అమర్నాథ్. విశాఖ పాలనా రాజధాని అనే విషయం ఇప్పటికిప్పుడు కొత్తగా చెప్పింది కాదని, వివేకా హత్యకేసుకి, జగన్ మాటలకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. జగన్ తోపాటు మంత్రులంతా సెప్టెంబర్ లో విశాఖకు వెళ్లిపోతామన్నారు. సచివాలయం తరలింపు కూడా అప్పుడేనని క్లారిటీ ఇచ్చారు.
సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ పరిపాలన జరుగుతుందని, సీఎం జగన్ విశాఖ రాకను ఎవరూ అడ్డుకోలేరన్నారు మంత్రి అమర్నాథ్. ముఖ్యమంత్రిగా జగన్, పరిపాలనను ఎక్కడ నుంచి అయినా నిర్వహించవచ్చని, వ్యవస్థలన్నీ సెప్టెంబర్ తర్వాత విశాఖ నుంచే పని చేస్తాయన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సీఎం జగన్ వైజాగ్ కు సెప్టెంబర్ లో కూడా రారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు.. పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా, వ్యతిరేకమా..? సమాధానం చెప్పాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.