Telugu Global
Andhra Pradesh

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు పదోన్నతి.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్

1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా తరచూ వార్తల్లోకి ఎక్కారు.

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు పదోన్నతి.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
X

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్‌ను డీజీపీ హోదాకు ప్రమోట్ చేశారు. ఆయన అదే హోదాలో సీఐడీ చీఫ్‌గా కొనసాగనున్నారు. ఇక కేంద్ర సర్వీసులో ఉన్న ఏపీ క్యాడర్ ఐపీఎస్‌లు మహేశ్ దీక్షిత్, అమిత్ గార్గ్‌లకు కూడా డీజీపీ హోదా లభించింది. వీరితో పాటు శ్యాంసుదర్, త్రివిక్రమ్ వర్మ, పాలరాజ్‌లకు ఐజీలుగా.. కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, అమ్మిరెడ్డిలకు డీఐజీలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా తరచూ వార్తల్లోకి ఎక్కారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని వెతికి పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయనపై ప్రతిపక్ష పార్టీలు అనేక ఆరోపణలు చేశాయి. వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొని వచ్చి డీఫేమ్ చేయడానికి ట్రై చేశాయి. కానీ సునీల్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. డీజీపీ హోదాకు ప్రమోట్ అయిన విషయం తెలసుకున్న పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

మళ్లీ దళితుడిగానే పుడతా..

సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో పీవీ సునీల్ కుమార్ రాసిన పోస్టులో 'మళ్లీ దళితుడిగానే పుడతా' అని చెప్పుకొచ్చారు. గతంలో ప్రమోషన్ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించారు. ఆ పోస్టులో ఏం రాశారంటే.. 'ప్రమోషన్ వార్త విన్న తర్వాత ఒక్క క్షణం భావోద్వేగానికి లోనయ్యాను. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. నేను వారిని కలిసి చాలా రోజులు అయ్యింది. వ్యక్తిగత పనుల కోసం సెలవు తీసుకున్నాను. సెలవు ముగించుకొని వచ్చే సరికి ఆయన తన షెడ్యూల్‌లో తీరిక లేకుండా ఉన్నారు. అందుకే కలవలేదు. అంతకు ముందు ఆయనను కలిసినప్పుడు నా ప్రమోషన్ గురించి ఏమీ ప్రస్తావించలేదు. అలాంటి సందర్భం లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకొని మరీ ప్రమోషన్ ఇచ్చినందుకు వారికి వేనవేల కృతజ్ఞతలు' అని అన్నారు.

'దళితుడిగా ఎవరు పుట్టాలి అని కోరుకుంటారని అంటే.. నేను మళ్లీ దళితుడిగానే పుడతాను. నా అవమానాల నుండి, పోరాటం నుంచి మనిషిగా ఎదుగుతాను. ఒళ్ళు బలుపు, చులకన భావం లేని మనిషిగా మళ్లీ దళితుడిగానే పుడతా.. మళ్లీ సీఎం జగన్‌కు నా కృతజ్ఞతలు' అంటూ భావోద్వేగంగా పోస్టు పెట్టారు.

First Published:  31 Dec 2022 3:57 PM IST
Next Story