Telugu Global
Andhra Pradesh

అదే సీఐడీ.. టార్గెట్ మాత్రమే మారింది

టీచర్ల బదిలీల విషయంలో మాజీ మంత్రి బొత్సను టార్గెట్ చేసినట్టు.. మద్యం వ్యవహారంలో వాసుదేవరెడ్డిని టీడీపీ ఇరుకున పెట్టాలని చూస్తోంది.

అదే సీఐడీ.. టార్గెట్ మాత్రమే మారింది
X

ఏపీలో అధికార మార్పిడి జరగడంతో వ్యవస్థలు కూడా చకచకా తమ ప్రాధాన్యాలు మార్చేసుకుంటున్నాయి. పోలీస్ వ్యవస్థే దీనికి పెద్ద ఉదాహరణ. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఇళ్లపై కోడిగుడ్లు, రాళ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు పక్కన నిలబడ్డారే కానీ ఆపే ప్రయత్నాలు చేయలేదు. పడాల్సిన రాళ్లన్నీ పడ్డాక ఆందోళనకారుల్ని అక్కడినుంచి పంపించేశారు. ఇక సీఐడీ కూడా తమ టార్గెట్ మార్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న అధికారులపై దాడులు మొదలు పెట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)కు గతంలో ఎండీగా పనిచేసిన డి.వాసుదేవరెడ్డి ప్రస్తుతం సీఐడీకి, టీడీపీకి టార్గెట్ గా మారారు. ఇదే సీఐడీ గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

వైసీపీ హయాంలో కొంతమంది అధికారులపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది, ఎల్లో మీడియా కూడా వారిపై విమర్శలతో విరుచుకుపడింది. ఇప్పుడు టీడీపీకి అధికారం రావడంతో ప్రతీకారం మొదలైంది. ముందుగా వాసుదేవరెడ్డిపై సీఐడీ దృష్టిసారించింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోదాలు మొదలు పెట్టింది. ఈనె 7 నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, బీరువాల్లో సోదాలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారని కూడా ఎల్లో మీడియా కథనాలిస్తోంది.

APSBCL ప్రధాన కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై సీఐడీ ఈనెల 6న కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ప్రాథమిక నివేదిక తయారు చేస్తారు. మద్యం అమ్మకాలు, బ్రాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయని గతంలోనే టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇప్పటికే క్వాలిటీ బ్రాండ్లు ఏపీలోకి వచ్చేస్తున్నాయని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి టీచర్ల బదిలీల విషయంలో మాజీ మంత్రి బొత్సను టార్గెట్ చేసినట్టు.. మద్యం వ్యవహారంలో వాసుదేవరెడ్డిని టీడీపీ ఇరుకున పెట్టాలని చూస్తోంది.

First Published:  10 Jun 2024 11:29 AM IST
Next Story