Telugu Global
Andhra Pradesh

ఏపీకి లోకేష్.. ముహూర్తం ఖరారు చేసిన సీఐడీ

ఢిల్లీలో ఎంపీ జయదేవ్ కార్యాలయంలో ఉన్న నారా లోకేష్ కి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్-4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఏపీకి లోకేష్.. ముహూర్తం ఖరారు చేసిన సీఐడీ
X

ఏపీకి లోకేష్.. ముహూర్తం ఖరారు చేసిన సీఐడీ

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో మకాం పెట్టిన నారా లోకేష్.. ఎట్టకేలకు ఏపీకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. అయితే ఇది ఆయన ఫిక్స్ చేసుకున్నది కాకపోవడం విశేషం. ఏపీ సీఐడీ అధికారులు విచారణకోసం నారా లోకేష్ కి నోటీసులిచ్చారు. అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అంటే ఈ విచారణ కోసం లోకేష్ అక్టోబర్-4న సీఐడీ కార్యాలయానికి రావాలన్నమాట. నోటీసులు అందుకున్నారు కాబట్టి ఆయన ఢిల్లీనుంచి బయలుదేరక తప్పడంలేదు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ఏ-14గా ఉన్నారు. ఇటీవల ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టుని ఆశ్రయించారు కూడా. అయితే హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. లోకేష్ పై విచారణ చేపట్టవచ్చని సీఐడీకి సూచిస్తూ, ముందుగా నోటీసులివ్వాలని పేర్కొంది. అదే సమయంలో లోకేష్ కూడా విచారణకు సహకరించాలన్నది. నోటీసులిచ్చేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా ఢిల్లీలో లోకేష్ కోసం గాలిస్తున్నా ఆయన దొరకడంలేదని తెలుస్తోంది. చివరకు అధికారులు వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారు. ఆ తర్వాత ఆయన అశోకా రోడ్డు-50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో సీఐడీ అధికారులు ఎంపీ జయదేవ్ కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అక్టోబర్-4న విచారణకు టైమ్ ఇచ్చారు కాబట్టి ఆ టైమ్ కల్లా లోకేష్ సీఐడీ ఆఫీస్ కి రావడం తప్పనిసరిగా మారింది.

అరెస్ట్ ఖాయమేనా..?

నారా లోకేష్ అరెస్ట్ కూడా ఖాయమని దాదాపుగా తెలుస్తోంది. చంద్రబాబు, నారాయణ, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజనీ కుమార్‌ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిలో కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కూడా. నారా లోకేష్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు పిటిషన్ ని డిస్పోజ్ చేయడం విశేషం. ఈ దశలో 41ఎ నోటీసుల్లో అరెస్ట్ ప్రస్తావన ఉండదు, కానీ విచారణ తర్వాత లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో టీడీపీ వర్గాలకు ముందుగానే భయం పట్టుకుంది.

First Published:  30 Sept 2023 5:35 PM IST
Next Story