హెరిటేజ్ డాక్యుమెంట్లు కాల్చేశారంటూ తప్పుడు ప్రచారం.. ఏపీ సీఐడీ సీరియస్
సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి పేరుతో ఈ ఖండన ప్రకటన విడుదలైంది. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొన్ని ఛానెళ్లలో బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాడేపల్లిలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశంటూ ఈరోజు ఉదయం నుంచి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి హెరిటేజ్ సంస్థకు చెందిన కీలక పత్రాలంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా కూడా రెచ్చిపోతోంది. జగన్ మెప్పుకోసం చంద్రబాబుపై సిట్ అనేక అక్రమ కేసులు పెట్టిందని.. ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు తగలబెడుతున్నారని కథనాలిచ్చింది. అయితే ఈ కథనాలపై సీఐడీ కూడా అంతే వేగంగా స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ ఓ ఖండన ప్రకటన విడుదల చేసింది.
సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి పేరుతో ఈ ఖండన ప్రకటన విడుదలైంది. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొన్ని ఛానెళ్లలో బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో తాము ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని, ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల పేజీలున్న కాపీలు రూపొందించామని తెలిపారు. ఆ ఛార్జ్ షీట్ కాపీలను నిందితులకు అందించామని కూడా వివరించారు.
ఇక హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కోర్టుకి అందజేశామని, ఆ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కూడా కోర్టుకి అందజేశామని తెలిపారు. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించామన్నారు. పారదర్శకంగా తాము పనిచేస్తుంటే.. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారాయన.
ఛార్జ్ షీట్ లు తయారు చేసే క్రమంలో తాము లక్షలాది పేపర్లు ప్రింట్ చేస్తుంటామని, ఆ సమయంలో కొన్ని సరిగా ప్రింట్ కావని పేర్కొన్నారు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి. ప్రింట్ సరిగా లేని పేపర్లను, వృథాగా ఉన్న వాటిని కాల్చి వేయడం సిబ్బంది విధి అని అన్నారు. అలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించి వార్తలు రాయడం సరికాదని చెప్పారు.