మార్గదర్శి ఎండీపై లుక్ ఔట్ నోటీసు
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మార్గదర్శి ఎండీకి ఒక రూలు, కడప ఎంపీ అవినాష్‌కు మరో రూలా అనే చర్చ మొదలైంది. విచారణకు సహకరిస్తున్నా లుక్ ఔట్ నోటీసు జారీచేయాల్సిన అవసరం ఏమిటని ఎల్లోమీడియా నానా రచ్చచేస్తోంది.
తనపై సీఐడీ జారీచేసిన లుక్ ఔట్ నోటీసును రద్దుచేయాలని మార్గదర్శి ఎండీ, ఛైర్మన్ రామోజీరావు కోడలు శైలజ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. అమరావతి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా తన క్లయింట్‌పై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకూడదని కోర్టు ఆదేశాలున్నప్పటికీ లుక్ ఔట్ నోటీసు జారీచేయటం అన్యాయమని శైలజ తరపు లాయర్ రత్నకుమార్ పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ విచారణకు ఇంట్లో అందుబాటులో ఉండాలని సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు.
విచారణకు హాజరయ్యేందుకు వీలుగా తన క్లయింట్ అమెరికా నుంచి 3వ తేదీన ఇండియాకు తిరిగివస్తున్నట్లు చెప్పారు. విచారణలో సీఐడీకి శైలజ సహకరిస్తున్నప్పటికీ లుక్ ఔట్ నోటీసు జారీ చేయటంపై లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేయటానికే లుక్ ఔట్ నోటీసు జారీ చేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. కాబట్టి జూన్ 3వ తేదీన విమానాశ్రయంలో తన క్లయింట్‌కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని లాయర్ కోరారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మార్గదర్శి ఎండీకి ఒక రూలు, కడప ఎంపీ అవినాష్‌కు మరో రూలా అనే చర్చ మొదలైంది. విచారణకు సహకరిస్తున్నా లుక్ ఔట్ నోటీసు జారీచేయాల్సిన అవసరం ఏమిటని ఎల్లోమీడియా నానా రచ్చచేస్తోంది. మరి సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతున్నా కూడా విచారణకు హాజరుకావటం లేదని, నోటీసులను ధిక్కరిస్తున్నారని ఎల్లోమీడియా ఎలా రాస్తోంది. సీబీఐ విచారణ తేదీన హాజరుకావటం కుదరకపోతే మరో తేదీ అడిగి విచారణకు ఎంపీ హాజరవుతున్నారు. అంతేకానీ విచారణను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేదు.
అయినా కానీ ఎంపీని ఎల్లోమీడియా వెంటాడుతోంది. అసలు అక్రమాలు, మోసం కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న శైలజ అమెరికా వెళ్ళే విషయాన్ని సీఐడీకి చెప్పారా..? సీఐడీకి చెప్పివెళితే లుక్ ఔట్ నోటీసులు ఎందుకు జారీచేస్తుంది..? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి మాత్రం ఎల్లోమీడియా ఎంటరైపోవచ్చు. అదే విమానాశ్రయంలో నుంచి శైలజ వచ్చేటప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకూడదా..?