నారాయణది ఫ్యామిలీ ప్యాకేజీయేనా?
నారాయణతో పాటు ఆయన ఇద్దరు కూతుర్లు సింధూర, శరణి, ఇద్దరు అల్లుళ్ళు పునీత్ , వరుణ్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఉద్యోగిని ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
రాజధాని భూముల కుంభకోణంపై విచారణకు రావాలని మాజీమంత్రి పొంగూరు నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీచేసింది. 41ఏ సీఆర్పీసీ కింద మార్చి 6వ తేదీన విచారణకు హాజరవ్వాలని సీఐడీ నోటీసులో స్పష్టంగా చెప్పింది. నారాయణతో పాటు ఆయన ఇద్దరు కూతుర్లు సింధూర, శరణి, ఇద్దరు అల్లుళ్ళు పునీత్ , వరుణ్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఉద్యోగిని ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
విచారణకు నారాయణతో పాటు కూతుర్లు, అల్లుళ్ళని కూడా హాజరవ్వాలని చెప్పటమంటే ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజీలాగే ఉంది. ఇంతమందిని విచారణకు రమ్మని ఎందుకు నోటీసులు జారీ అయ్యాయి? ఎందుకంటే టీడీపీ హయాంలో రాజధాని అమరావతి వ్యవహారాలు నారాయణే అన్నీ తానై నడిపించారు. నారాయణ ఆధ్వర్యంలోనే పార్టీలోని ప్రముఖులు వెయ్యి కోట్ల రూపాయల బ్లాక్ మనీని 169 ఎకరాల కొనుగోలుకు మళ్ళించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే రూ. 5600 కోట్ల విలువైన 1400 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల దగ్గర నుండి ఒత్తిడిపెట్టి లాక్కున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వ్యక్తిగతంగా నారాయణ కూడా రాజధాని భూములను సొంతం చేసుకోవటమే కాకుండా 140 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నారనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయని సీఐడీ కేసులు నమోదు చేసింది. భూములు కొనేందుకు రామకృష్ణ హౌసింగ్ ద్వారా నారాయణ డబ్బులు మళ్ళించినట్లు ఆధారాలున్నాయట. అదికూడా కూతుర్లు, అల్లుళ్ళపేర్లతో పాటు డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లను బినామీలుగా పెట్టి పెద్ద ఎత్తున భూములు కొన్నారనే ఆరోపణలున్నాయి నారాయణపైన.
మొత్తం మీద ఒకే ఆరోపణపై ప్యాకేజీ కింద ఫ్యామిలీ మొత్తాన్ని విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇవ్వటం బహుశా ఇదే మొదటిసారేమో. ఈ కేసులో గతంలో నారాయణను అరెస్టు చేసిన సీఐడీ తొందరలోనే కూతుర్లు, అల్లుళ్ళపైన కూడా కేసులు నమోదుచేసి అరెస్టు చేయచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సంచలనమవ్వటం ఖాయం. ఇంతమందికి నోటీసులిచ్చిన సీఐడీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో చూడాలి. ఎందుకంటే విచారణకు సీఐడీ పిలిచినా తర్వాత ఆ ఆధారాలు కోర్టులో నిలవాలి కదా. చూద్దాం మార్చి 6వ తేదీ తర్వాత ఏమి జరుగుతుందో.