చంద్రబాబుపై మరో కేసులో పిటిషన్
ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ వ్యవహారంలోనూ చంద్రబాబును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలోనూ చంద్రబాబును విచారించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ వ్యవహారంలోనూ చంద్రబాబును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్డడీకి అప్పగించాలని పిటిషన్ వేసింది సీఐడీ. దాంతో పాటు ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ విచారించేందుకు వీలుగా పీటీ వారెంట్ పిటిషన్ వేసింది.
ఈ కేసులో చంద్రబాబు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, నారా లోకేష్ ఏ6గా ఉన్నారు. అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌తో పాటు 14 రోజుల రిమాండ్ కాలాన్ని హౌజ్ అరెస్ట్‌గా మార్చాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పిటిషన్ వేశారు. వీటిపైన ఏసీబీ కోర్టు విచారించనుంది.
చంద్రబాబును మరి కొన్ని రోజుల పాటు జైలులో ఉంచాలన్న ఉద్దేశంతోనే పీటీ వారెంట్ పిటిషన్లు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.