పీవీ రమేష్‌కు అంతసీన్ లేదన్న సీఐడీ
తాము ఈ కేసును కేవలం పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే నడపటంలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో నేరానికి సంబంధించిన ఇతర అనేక ఆధారాలున్నాయని వివరించింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఐడీ కౌంటర్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా రమేష్ వ్యాఖ్యలు ఉన్నాయని సీఐడీ అభ్యంతరం తెలిపింది. తాను సీఐడీకి స్టేట్‌మెంట్ ఇచ్చింది నిజమేనని, కానీ అందులో చంద్రబాబు తప్పు చేసినట్టు చెప్పలేదని, అయినా సరే తానిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు మీడియాలో ప్రచారం నడుస్తోందని పీవీ రమేష్ తొలుత అభ్యంతరం తెలిపారు. పైగా ఓరిజినల్ ఫైల్స్ లేకుండా షాడో ఫైల్స్ ఆధారంగా కేసులు సాధ్యం కాదంటూ రమేష్ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. తాము ఈ కేసును కేవలం పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే నడపటంలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో నేరానికి సంబంధించిన ఇతర అనేక ఆధారాలున్నాయని వివరించింది. ఇతర వ్యక్తుల స్టేట్‌మెంట్లు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. పీవీ రమేష్ కేవలం తన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఈ కేసు నడుస్తోందని భావించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దర్యాప్తులో పీవీ రమేష్ స్టేట్‌మెంట్ ఒక భాగం మాత్రమేనని స్పష్టత ఇచ్చింది. దాంతో పాటు ఈ కేసులో పీవీ రమేష్ ప్రమేయంపైనా సీఐడీ కొన్ని విషయాలను చెబుతోంది.
నిధుల విడుదల సమయంలో అంత సొమ్ము ఒకేసారి కాకుండా ఒక్కో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సొమ్మును విడుదల చేద్దామని కిందిస్థాయి అధికారిణి చెప్పినా పీవీ రమేష్ పట్టించుకోలేదని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు అరెస్ట్ హాస్యాస్పదంగా ఏమీ జరగలేదని కౌంటర్ ఇచ్చింది.