Telugu Global
Andhra Pradesh

మార్గ‌ద‌ర్శి కేసులో రామోజీరావు ఆస్తుల‌ను అటాచ్ చేసిన సీఐడీ

ఖాతాదారులకు వెంటనే డబ్బు ఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదని ఈ సంద‌ర్భంగా సీఐడీ స్ప‌ష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు చేస్తోంద‌ని తెలిపింది.

మార్గ‌ద‌ర్శి కేసులో రామోజీరావు ఆస్తుల‌ను అటాచ్ చేసిన సీఐడీ
X

ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గ‌ద‌ర్శి అక్ర‌మ వ్య‌వ‌హారాల కేసును విచారిస్తున్న సీఐడీ.. ఆ సంస్థ ఆర్బీఐ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించింద‌ని, ఇన్‌కం ట్యాక్స్ చ‌ట్టాల‌ను అతిక్ర‌మించింద‌ని, చిట్‌ఫండ్ సంస్థ‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

రూ.793 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌...

ఈ నేప‌థ్యంలోనే మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో రామోజీరావు ఆస్తులను అటాచ్ చేస్తున్న‌ట్టు సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో సీఐడీ వెల్ల‌డించింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు తెలిపింది. భారీగా నగదు, బ్యాంక్ ఖాతాల్లో నిధులు, మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్లను అటాచ్ చేసిన‌ట్టు వివ‌రించింది. మార్గదర్శి చిట్స్ ఖాతాదారుల భద్రత కోసమే రామోజీరావు ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు సీఐడీ తెలిపింది. ఈ కేసులో రామోజీరావు ఏ-1గా, శైల‌జాకిర‌ణ్ ఏ-2గా ఉన్న విష‌యం తెలిసిందే.

చిట్స్ సొమ్ముతో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు..

మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడినట్టు సీఐడీ తెలిపింది. మార్గ‌ద‌ర్శిలోని నిధులను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ళ్లించింద‌ని, చ‌ట్ట‌వ్య‌తిరేకంగా డిపాజిట్లు సేక‌రించింద‌ని వివ‌రించింది. మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించింది. ఈ విధంగా ఇన్‌కం ట్యాక్స్ చ‌ట్ట ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డింద‌ని తెలిపింది.

ఖాతాదారులకు డబ్బు ఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదు..

ఖాతాదారులకు వెంటనే డబ్బు ఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదని ఈ సంద‌ర్భంగా సీఐడీ స్ప‌ష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు చేస్తోంద‌ని తెలిపింది. ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించిందని సీఐడీ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్గ‌ద‌ర్శి 37 బ్రాంచీల ద్వారా వ్యాపారం చేస్తోందని, ఏపీలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్ గ్రూపులు.. తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయ‌ని వివ‌రించింది. రామోజీరావు ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ సీఐడీ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  30 May 2023 6:38 AM IST
Next Story