Telugu Global
Andhra Pradesh

ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు గతేడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గతేడాది ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుకి అనుకూలంగా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
X

ఏపీ రాజధాని వ్యవహారంలో హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపుగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పిటిషన్లను త్వరితగతిన విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి ప్రస్తావించడంతో న్యాయమూర్తులు కేసు విచారణను 23న చేపడతామన్నారు.

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు గతేడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గతేడాది ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుకి అనుకూలంగా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై గతేడాది నవంబరు 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేశారు. అయితే ఆరోజు విచారణ జరగలేదు. ఈ పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు. దీంతో కేసు ఫిబ్రవరి 23కి వాయిదా పడింది.

అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు విచారణ సందర్భంగా స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. జనవరి 31న విచారణ జరగనందున.. తమకు కౌంటర్ దాఖలు కోసం కనీసం 2 వారాలు సమయం కావాలన్నారు. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

First Published:  6 Feb 2023 3:59 PM IST
Next Story