దూకుడు పెంచండి.. మంత్రులకు జగన్ పరోక్ష హెచ్చరిక
టీడీపీపై విమర్శల దూకుడు పెంచాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో కొందరు వెనకబడి ఉన్నారని, వారు కూడా స్పీడ్ పెంచాలని చెప్పారట.
రాబోయేది ఎన్నికల కాలం.. ఇంకా నిదానంగా ఉంటే కుదరదు, దూకుడు పెంచండి.. అంటూ సీఎం జగన్ మంత్రులకు సూచనలిచ్చారు. ఒకరకంగా ఆయన కాస్త కటువుగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో జగన్ పలు కీలక విషయాలను మంత్రులతో చర్చించారు. జులై నుంచి విశాఖ కేంద్రంగా పాలన మొదలవుతుందని, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు సూచించారు జగన్.
శాఖపై పట్టు అవసరం..
ఎవరి శాఖలపై వారు పట్టు పెంచుకోవాలని, కూలంకషంగా అధ్యయనం చేసి ప్రెస్ మీట్లలో సమాధానాలు ఇవ్వాలని మంత్రులకు సూచించారు సీఎం జగన్. అసెంబ్లీలో కూడా ఆయా శాఖల మంత్రులు గణాంకాలతో సహా సమాధానాలివ్వాలని చెప్పారు. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వారికి మరో అవకాశం ఇస్తున్నట్టు తెలిపిన జగన్, ఇంకా మారకపోతే ఎన్నికల ఏడాదిలో వారిని పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని పరోక్షంగా హెచ్చరించారు.
దూకుడు పెంచండి..
టీడీపీపై విమర్శల దూకుడు పెంచాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో కొందరు వెనకబడి ఉన్నారని, వారు కూడా స్పీడ్ పెంచాలని చెప్పారట. ఎన్నికల ఏడాది మరింత చురుగ్గా ఉండాలని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు జగన్.
ఈనెల 16న బడ్జెట్..
ఇక బీఏసీ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 24వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఈనెల 16న బడ్జెట్ ప్రవేశపెడతారు. 22వ తేదీ ఉగాది సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుందన్నారు. మొత్తం 9రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.