Telugu Global
Andhra Pradesh

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో 70 అంశాలు

తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎం జగన్, మంత్రులతో చర్చించే అవకాశముంది. ప్రతిపక్షాల విమర్శలు, వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై కూడా కేబినెట్ తర్వాత చర్చ జరిగే అవకాశముంది.

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో 70 అంశాలు
X

ఏపీలో అధికార వైసీపీ, జనసేన మధ్య రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ, ఈరోజు కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. సుమారు 70 అంశాలను కేబినెట్ అజెండాలో చేర్చినట్టు సమాచారం. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపిన ప్రాజెక్టులపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పురోగతిపై చర్చిస్తారు. పలు శాఖల్లో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది కేబినెట్.

ఇటీవల రాష్ట్రంలో 8 కొత్త ప్రాజెక్ట్ లకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల పై కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకుంటారు. ఆయా పరిశ్రమల స్థాపనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. హైడ్రో స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు, కోకాకోలా బెవేరేజెస్ వంటి కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

దేవదాయ శాఖలో ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాల పంపిణీపైనా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. 9 వేల ఎకరాల లంక భూములపై 19 వేల మంది లబ్ధిదారులకు పట్టాల రూపంలో ప్రభుత్వం హక్కు కల్పించబోతోంది. జులై, ఆగస్ట్ నెలల్లో అమలు చేసే సంక్షేమ పథకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది.

రాజకీయాలపై చర్చ..

తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎం జగన్, మంత్రులతో చర్చించే అవకాశముంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షాల విమర్శలు, వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై కూడా కేబినెట్ తర్వాత చర్చ జరిగే అవకాశముంది.

First Published:  12 July 2023 7:53 AM IST
Next Story