ఈనెల 24న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21న ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగిన రెండోరోజు ఏపీ కేబినెట్ భేటీ అవుతుంది.

ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కేబినెట్ ఈనెల 24న తొలిసారిగా భేటీ కాబోతోంది. ఉదయం 10గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం మొదలవుతుంది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
సీఎం చంద్రబాబుతోపాటు మొత్తం 24మంది కేబినెట్ లో ఉన్నారు. వీరంతా ఈ సమావేశానికి హాజరవుతారు. దాదాపు మంత్రులంగా ఒక్కొక్కరే బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ భేటీలోపు మంత్రులంతా బాధ్యతలు స్వీకరించి తమ పోర్ట్ ఫోలియోల గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుంటారు. అనంతరం మీటింగ్ జరుగుతుంది.
రెండు రోజులపాటు అసెంబ్లీ..
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21న ప్రారంభమవుతున్నాయి. రెండు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలు జరిగిన రెండోరోజు ఏపీ కేబినెట్ భేటీ అవుతుంది.