Telugu Global
Andhra Pradesh

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదించింది.

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..
X

ఏపీ కేబినెట్ భేటీలో ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులనే నిబంధన ఇప్పటి వరకూ ఉండేది. దీన్ని ఎత్తివేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 22ఏ సెక్షన్ కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే హోల్డ్ లో పెట్టారు, వాటి రిజిస్ట్రేషన్లు మరో మూడు నెలలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ పుస్తకాలు జారీ చేయాలని కేబినెట్ తీర్మానించినట్టు తెలిపారు మంత్రి పార్థసారథి.


ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించేలా నూతన పాలసీ తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుగుతోంది. ఏపీలో రీసర్వే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలిపారు మంత్రి. ఇక సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదించింది. జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని, ఏపీ రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు హక్కుదారులకు అందిస్తారు.

మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల్లో అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఇక పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ని ప్రారంభించేందుకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

First Published:  7 Aug 2024 8:18 PM IST
Next Story