డీఎస్సీ విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీలో చివరగా 2022లో టెట్ నిర్వహించారు. ఆ పరీక్షకు 4.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష రాసిన వారిలో రెండు లక్షల మంది అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ లో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకిగాను డీఎస్సీ- 2024 విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ముందుగా టెట్ లో క్వాలిఫై అయిన తర్వాతే డీఎస్సీ రాయాల్సి ఉండడంతో ముందుగా ఏపీలో టెట్ నిర్వహించి ఆ ఫలితాలు విడుదలైన వెంటనే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఏపీలో చివరగా 2022లో టెట్ నిర్వహించారు. ఆ పరీక్షకు 4.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష రాసిన వారిలో రెండు లక్షల మంది అర్హత సాధించారు. ఇప్పుడు నిర్వహించే టెట్ కు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా టెట్ నిర్వహించి ఆ తర్వాత డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1998, 2008 నోటిఫికేషన్లకు సంబంధించి 7వేల టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు నేరుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనుంది. సుదీర్ఘ విరామం తర్వాత డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.