Telugu Global
Andhra Pradesh

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

మార్చి 14న కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోజు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!
X

ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు (ఫిబ్రవరి 27) నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించినా.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఉన్నందున బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 12 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నది.

మార్చి 14న కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోజు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28, 29న విశాఖపట్నంలో జీ-20 సమ్మిట్‌కు సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ లోపే బడ్జెట్ సమావేశాలు ముగించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇక మార్చి 22న ఉగాది సందర్భంగా ఒకటి, రెండు రోజులు సభకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

ఉగాది లోపు తాను వైజాగ్ షిఫ్ట్ అవుతానని గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖపట్నం నుంచే తాను పరిపాలన కొనసాగిస్తానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైజాగ్ విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతం మూడు రాజధానులకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నది. ఆ కేసుకు సంబంధించిన డెవలెప్‌మెంట్స్ బట్టి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని సమాచారం.

కాగా, ప్రతిపక్ష తెలుగుదేశం కూడా బడ్జెట్ సమావేశాలకు సిద్ధపడుతున్నది. పెరిగిన ధరలు, శాంతి భద్రతల వైఫల్యం, ఇటీవల పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెరిగిన దాడులపై టీడీపీ ప్రశ్నించే అవకాశం ఉన్నది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని గతంలోనే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు ప్రతినబూనారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ క్రమంలో ఆ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. మార్చి మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ జారీ అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలం కారణంగా ఈ ఏడు స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. 2024లో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇదే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ కానున్నది. ఈ సారి వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నది. మహిళలకు సంబంధించిన విషయాలపై కూడా కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు.

First Published:  27 Feb 2023 7:23 AM IST
Next Story