Telugu Global
Andhra Pradesh

ఈనెల 14నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..

వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న ఏపీలో ఈ బడ్జెట్ అధికార పక్షానికి కీలకంగా మారింది. కొత్త పథకాల ప్రస్తావన ఉంటుందా, లేక ఉన్న పథకాలకే సర్దుబాట్లు చేస్తారా అనేది ఈనెల 17న తేలిపోతుంది.

ఈనెల 14నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..
X

ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ రెడీ అయింది. ఈనెల 14నుంచి 29వరకు బడ్జెట్ సెషన్ జరపాలని నిర్ణయించారు. 17వతేదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. సెలవలన్నీ పోను 11రోజులు అసెంబ్లీ జరుగుతుంది. 17వతేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం 18, 19 తేదీలు సెలవలు ఉంటాయి. 22న ఉగాది సందర్భంగా సెలవు, 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు సెలవలు. ఇక 30వతేదీ శ్రీరామనవమి సెలవు కావడంతో ఒకరోజు ముందే 29వ తేదీన బడ్జెట్ సమావేశాలు పూర్తవుతాయి. అయితే బీఏసీ సమావేశంలో తేదీలు అధికారికంగా ఖరారవుతాయి.

వాడివేడిగా..

ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. 13వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ గురించి ప్రభుత్వం ఈ సమావేశాల సందర్భంగా మరోసారి ఘనంగా చెప్పుకునే అవకాశముంది. ప్రతిపక్ష టీడీపీకి కూడా ఈసారి చాలా అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశముంది. ఏపీలో సీఐడీ కేసులు, జీవో-1 వివాదం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్.. తదితర అంశాలపై టీడీపీ గొడవ చేసే అవకాశముంది. ఇక బడ్జెట్ కేటాయింపులపై రుసరుసలు, విమర్శలు ఉండనే ఉంటాయి. నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రెబల్స్ దారెటు..?

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎటువైపు ఉంటారు, అవకాశం వస్తే ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకూ జగన్ ని పొగుడుతూ, చంద్రబాబుపై విరుచుకుపడిన నేతలు, ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పుడే బయటపడతారా, లేక వేచి చూసే ధోరణిలో ఉంటారా, పూర్తి సైలెంట్ గా పక్కకు తప్పుకుంటారా అనేది వేచి చూడాలి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న ఏపీలో ఈ బడ్జెట్ అధికార పక్షానికి కీలకంగా మారింది. కొత్త పథకాల ప్రస్తావన ఉంటుందా, లేక ఉన్న పథకాలకే సర్దుబాట్లు చేస్తారా అనేది ఈనెల 17న తేలిపోతుంది.

First Published:  14 March 2023 12:00 AM IST
Next Story