వైన్ షాపుల్లో ఆ తప్పు జరగడంలేదు.. ఏపీ ప్రభుత్వం వివరణ
కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్ లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ జరుగుతోంది, మరికొన్ని చోట్ల ఎస్‌బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్, ఏపీలో వైన్ షాపుల వ్యవహారంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. వైన్ షాపుల్లో బిల్లులు ఇవ్వడంలేదని, కనీసం డిజిటల్ పేమెంట్లు కూడా తీసుకోవడంలేదని, లెక్కాపత్రం లేని ఆ సొమ్మంతా జగన్ ఖాతాలో జమ అవుతోందన్నారు పవన్. ఏపీలో రూ.1.25లక్షల కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తోందని అందులో 97వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తోందని, మిగతాదంతా జగన్ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు పవన్. ఆ సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనబోతున్నారని చెప్పారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వైన్ షాపుల్లో ఆ తప్పు జరగడంలేదని చెప్పింది.
రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బేవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవంటూ పవన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టామని.. అది సక్రమంగా అమలవుతోందని బేవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది.
డిజిటల్ చెల్లింపులు ఇలా..
కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్ లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ జరుగుతోంది, మరికొన్ని చోట్ల ఎస్‌బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. దాదాపు రూ.1.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను డిజిటల్ చెల్లింపుల ద్వారానే నిర్వహించామని తెలిపారు బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులు. అయితే నగదు చెల్లింపులకు కూడా దుకాణాల్లో అనుమతి ఉందని చెప్పారు. డిజిటల్ చెల్లింపులు, స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేనివారి కోసం నేరుగా నగదు తీసుకుంటున్నట్టు తెలిపారు. అసలు డిజిటల్ చెల్లింపులు లేవంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.