Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై బీజేపీ సాఫ్ట్ కార్నర్..

మరీ బెట్టు చేసి సున్నా చుట్టుకోవడం కంటే.. టీడీపీ దయతో ఒకటీ రెండుసీట్లయినా దక్కితే సరిపెట్టుకోవచ్చని ఏపీ బీజేపీ భావిస్తున్నట్టుంది. అందుకే పొత్తుల వ్యవహారాన్ని అధిష్టానానికే వదిలేసింది.

చంద్రబాబుపై బీజేపీ సాఫ్ట్ కార్నర్..
X

చంద్రబాబు విషయం బీజేపీకి బాగా తెలుసు. తనకి అవసరం ఉందనుకుంటే.. ప్రత్యేక ప్యాకేజీ కూడా పరమాన్నంగా భావిస్తారు, బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనుకుంటే మాత్రం హోదా ఇవ్వలేదనే నింద మీదేస్తారు. గత అనుభవాలతో బీజేపీ చంద్రబాబుని బాగానే దూరం పెట్టింది. తిరిగి దగ్గరకు రానిచ్చే ఆలోచన కూడా ఆ పార్టీకి లేదు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, బీజేపీ నాయకుల స్టేట్ మెంట్లు.. ఎక్కడో ఏదో తేడా వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుల అంశంపై పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానానికి వివరించామని చెప్పారాయన. ఆమధ్య జీవీఎల్ నరసింహారావు కూడా పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు.

చంద్రబాబుని దగ్గరకు రానివ్వం, మా పొత్తు జనసేనతోనే, ఏపీలో మేం ఎదుగుతున్నామంటూ కొంతకాలంగా బీజేపీ బీరాలు పలికింది. ఇటీవల కర్నాటకలో తలబొప్పి కట్టడంతో కాస్త డీలా పడింది. అంతంతమాత్రంగానే ఉన్న తెలంగాణలో కూడా పాచిక పారదని తేలిపోయింది, ఏపీలో వ్యవహారం మరింత తేడా కొడుతుందనే విషయం కూడా వారికి అర్థమైంది. ఈ దశలో మరీ బెట్టు చేసి సున్నా చుట్టుకోవడం కంటే.. టీడీపీ దయతో ఒకటీ రెండుసీట్లయినా దక్కితే సరిపెట్టుకోవచ్చని ఏపీ బీజేపీ భావిస్తున్నట్టుంది. అందుకే పొత్తుల వ్యవహారాన్ని అధిష్టానానికే వదిలేసింది.

వైసీపీపై తీవ్ర విమర్శలు..

ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోందన్నారు సోము వీర్రాజు. కేంద్రం నిధులిస్తుంటే వాటిని తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం నిధులను వైసీపీ కార్యకర్తలు పక్కదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో వారికి వాటా లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల ఊపు చూస్తుంటే.. బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని అనుమానం వస్తుంది.

First Published:  16 May 2023 5:22 PM IST
Next Story