జగన్ మాటల్లో అంత అర్థముందా..? గగ్గోలు పెడుతున్న బీజేపీ
తనకు బీజేపీ మద్దతు లేదని అన్నారు జగన్. ఇప్పుడు లేదు అంటే ఇంతకు ముందు ఉందా అని ఎవరూ లాజిక్ తీయలేదు, ఒకవేళ తీసినా ఇంతకు ముందూ లేదు, ఇప్పుడూ లేదు అని జగన్ తేల్చి చెప్పేవారు.
ఇటీవల సీఎం జగన్.. దుష్ట చతుష్టయం అంటూ మధ్యలో బీజేపీ ప్రస్తావన కూడా తెచ్చారు. తనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు సపోర్ట్ లేదని, బీజేపీ సపోర్ట్ కూడా లేదని అన్నారు. ఎవరి సపోర్ట్ లేకపోయినా తనకు ప్రజల మద్దతు చాలన్నారు. అయితే ఇక్కడ ఏపీ బీజేపీ తెగ ఇదైపోతోంది. సీఎం జగన్ కావాలనే బీజేపీ పేరు ప్రస్తావించారని, అసలు ఏపీలో బీజేపీ, జగన్ కి మద్దతు ఎందుకిస్తుందని లాజిక్ తీస్తున్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ అండగా ఉంచకపోవచ్చని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల్ని ఖండించారాయన. ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. వైసీపీకి ఇప్పటివరకు బీజేపీ అండగా ఉందనే విధంగా సీఎం జగన్ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని జగన్ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి లింకులు లేవన్న ఆయన.. వైసీపీతో తాము ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరణ ఇచ్చారు.
జగన్ మాటల్లో అంత అర్థముందా..?
తనకు బీజేపీ మద్దతు లేదని అన్నారు జగన్. ఇప్పుడు లేదు అంటే ఇంతకు ముందు ఉండేదా అని ఎవరూ లాజిక్ తీయలేదు, ఒకవేళ తీసినా ఇంతకు ముందూ లేదు, ఇప్పుడూ లేదు అని జగన్ తేల్చి చెప్పేవారు కూడా. మరి బీజేపీకి ఆ అనుమానం ఎందుకొచ్చింది. వైసీపీకి బీజేపీ మద్దతు గతంలో ఉండేదని ఎవరూ చెప్పకపోయినా కమలదళం భుజాలు తడుముకోవడమెందుకు..? తప్పుగా మాట్లాడింది జగనా లేక, ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. అమిత్ షా వంటి కీలక నేత రాష్ట్రానికి వచ్చి వైసీపీ అవినీతిని ఎండగట్టారని, అయితే దాన్ని కవర్ చేసుకునేలా సీఎం జగన్ బీజేపీ మద్దతు తమకు లేదంటున్నారని చెప్పుకొచ్చారు జీవీఎల్. ఎన్నికల సమయంలో ఏపీలో పొత్తుపొడుపుల వేళ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమిత్ షా ప్రసంగాన్ని అనువాదం చేయడంలో తడబడినట్టే.. ఇప్పుడు జగన్ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవడంలో కూడా ఆయన భ్రమపడ్డారంటూ వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి.