చర్చిల నిర్మాణానికి సర్కారు నిధులా..? కోర్టుకెళ్తాం - సోము
చర్చిల వ్యవహారంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. చర్చిలకు ఇవ్వాలనుకుంటున్న నిధుల్ని వెంటనే ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఏపీలో చర్చిల నిర్మాణం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కోటి రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేయగా, దీనిపై జిల్లాల కలెక్టర్లు తాజాగా ప్రతిపాదనలు కోరారు. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది. అసలు ప్రభుత్వ నిధులతో చర్చిల నిర్మాణం ఏంటని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. వెంటనే ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కోర్టు మెట్లెక్కుతామని హెచ్చరించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి డబ్బులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేవు, ఉద్యోగుల జీతాలు పెంచడానికి ఖజానా నిండుకుంది అని సాకులు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ, చివరికిలా అన్యమత ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు సోము వీర్రాజు. మొత్తమ్మీద చర్చిల వ్యవహారంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. చర్చిలకు ఇవ్వాలనుకుంటున్న నిధుల్ని వెంటనే ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
రాజధాని విషయంలో దొందూ దొందే..
మూడు రాజధానులు కావాలని వైసీపీ, అమరావతే ఏకైక రాజధాని కావాలని టీడీపీ క్లియర్ స్టాండ్ తీసుకున్నాయి. కానీ మధ్యలో బీజేపీ మాత్రం ఎటూ తేల్చలేక సతమతం అవుతోంది. కర్నూలుకి న్యాయరాజధాని కావాలనేది బీజేపీయే, అదే సమయంలో అమరావతి నుంచి రాజధాని తరలించొద్దని చెప్పేదీ ఆ పార్టీయే. తాజాగా మరోసారి రాజధాని విషయంలో తమ డొల్లతనాన్ని కవర్ చేసుకోవాలని చూశారు సోము వీర్రాజు. రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ – వైసీపీ మిలాఖత్ అయ్యాయని అన్నారాయన. రాజధాని నిర్మాణ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం ప్రశ్నించడం లేదని విమర్శించారు సోము వీర్రాజు.
పొదుపు సంఘాల గొప్పదనం నీది కాదు బాబూ..
ఇటీవల విశాఖ పర్యటనలో మోదీ పొదుపు సంఘాల గురించి అడిగారని, తనని మెచ్చుకున్నారని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై కూడా ఏపీ బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అసలు పొదుపు సంఘాలు స్థాపించింది పీవీ నరసింహారావు అని, అది చంద్రబాబు గొప్పదనం ఎలా అవుతుందని అన్నారు సోము వీర్రాజు. పొదుపు సంఘాలకు 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రధాని మోదీ తీర్మానం చేశారన్నారు.
పవన్ ని తిడతారెందుకు..?
పవన్ కల్యాణ్ విషయంలో కూడా సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.35 వేల కోట్లు ఇచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఇవ్వడానికి కష్టపడుతోందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు నిధులివ్వకుండా.. అక్రమాలు చేస్తూ పవన్ కల్యాణ్ ని విమర్శిస్తారెందుకని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఇళ్ల నిర్మాణంపై జనసేనతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు.