పురందేశ్వరిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా?
జగన్ అంటే ఆమెలో కూడా మరిది చంద్రబాబులాగే ధ్వేషభావం పెరిగిపోతోంది. అందుకనే అప్పులని, ఇసుక అక్రమ తవ్వకాలని, మద్యం కుంభకోణమని, టిడ్కో ఇళ్ళనిర్మాణంలో అవినీతి అని ఏదో పేరుతో రోజూ ఆరోపణలు చేస్తునే ఉన్నారు.
రోజురోజుకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లే ఉంది. ఈ కారణంగానే ఆమె జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిపై ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేయటం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయటం కూడా బహుశా ఇందులో భాగమనే అనుకోవాలి. తనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్న విషయాన్ని ఆమె దాచుకోవటంలేదు.
ఇంతకీ ఆమెలో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతున్నట్లు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెలో కూడా మరిది చంద్రబాబులాగే ధ్వేషభావం పెరిగిపోతోంది. అందుకనే అప్పులని, ఇసుక అక్రమ తవ్వకాలని, మద్యం కుంభకోణమని, టిడ్కో ఇళ్ళనిర్మాణంలో అవినీతి అని ఏదో పేరుతో రోజూ ఆరోపణలు చేస్తునే ఉన్నారు. అయితే ఈమె ఆరోపణలను కేంద్ర ప్రభుత్వమే పట్టించుకోవటంలేదు. పైగా ఈమె ఆరోపణలకు కేంద్రమే ఖండనిస్తున్నట్లుంది.
ఏపీ నెత్తిన రూ.10 లక్షల కోట్ల అప్పుందని ఆమె పదేపదే ఆరోపించారు. అయితే పార్లమెంటులో ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ఏపీ అప్పులను రూ. 4.7 లక్షల కోట్లుగా తేల్చారు. ఇక్కడే పురందేశ్వరికి మొదటి దెబ్బ పడింది. తర్వాత టిడ్కో ఇళ్ళ కట్టకుండా జగన్ డ్రామాలాడుతున్నట్లు ఆరోపించారు. ఇదే విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం లక్షలాది టిడ్కో ఇళ్ళు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఆమెకు రెండో షాక్ తగిలింది. జగన్‌కు వ్యతిరేకంగా అమిత్ షాకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు.
వైసీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. వెంటనే సీఐడీ చంద్రబాబు మీద మద్యం కుంభకోణం కేసు నమోదు చేసింది. ప్రభుత్వంలో రూ. 2 వేల కోట్ల ఇసుక కుంభకోణం జరిగిందన్నారు. వెంటనే సీఐడీ చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక అక్రమాల మీద కేసు నమోదు చేసింది. అంతకుముందే స్కిల్ స్కామ్‌లో అరెస్టు చేసి 53 రోజులు రిమాండులో ఉంచింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జగన్ ప్రభుత్వం మీద పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలకు పార్టీ నుండి పెద్దగా మద్దతు దొరకటంలేదు.
అంటే పార్టీలో పురందేశ్వరి ఒంటరి అయిపోయారన్న విషయం అందరికీ తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి అధ్యక్షురాలిపై బహిరంగంగా తిరుగుబాటు చేశారు. పురందేశ్వరి హఠావో.. బీజేపీ బచావో అనే నినాదాన్ని వినిపించారు. పురందేశ్వరి అధ్యక్షరాలైన దగ్గర నుండి చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి అనేక కారణాలతో పురందేశ్వరిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది.