చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారో.. చిన్నమ్మకు తెలియదట..!
చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్లారో తెలియదని పురందేశ్వరి మీడియాతో చెప్పారు. పొత్తుల వ్యవహారం పార్టీ అగ్రనాయకత్వమే చూసుకుంటుందని పాతపాటే పాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిశారు. అర్ధరాత్రి వరకు వేచి ఉండి మరీ వారితో మాట్లాడారు. బాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలవబోతున్నారన్న విషయంలో మీడియాలో రెండు రోజులుగా వైరలవుతోంది. బాబ్బాబూ మీరూ కలిసి రండి.. జగన్‌పై పోరాడదాం అని బతిమాలడానికి చంద్రబాబు వెళ్లారన్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలోని చిన్నపిల్లాడికి కూడా తెలుసు.. కానీ, చిన్నమ్మ పురందేశ్వరికి మాత్రం తెలియదంట! అదేగా మరి జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల పరిస్థితి.
పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందట!
చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్లారో తెలియదని పురందేశ్వరి మీడియాతో చెప్పారు. పొత్తుల వ్యవహారం పార్టీ అగ్రనాయకత్వమే చూసుకుంటుందని పాతపాటే పాడారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏ రకమైన పొత్తు పెట్టుకోవాలో వారే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ముక్తాయించారు. అవునులే మేడం.. మీకంత కంటే లేదని మాకు తెలియదా అంటూ మీడియావాళ్లు లోపల్లోపలే గొణుకున్నారనుకోండి.
అబ్బే స్పందించకూడదన్న సత్యకుమార్
పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఇదే పాట పాడారు. జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలపై తమకు అవగాహన ఉండదని పాపం తన రాజకీయ అజ్ఞానాన్ని బయట పెట్టేసుకున్నారు. అంతేకాదు అలాంటివాటిపై స్పందించకూడదనీ సెలవిచ్చారు.