జగన్‌పై పురందేశ్వరి ‘ఆక్రోశం’.. అనని మాటలను మోడీకి ఆపాదించి..
మోడీ హిందీలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ అనువాదంలో మోడీ అనని మాటలను కూడా చేర్చారు.
చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని చెప్పలేదు. అయితే, ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి నచ్చినట్లు లేదు. దాంతో మోడీ ప్రసంగానికి ఆమె కొంత మసాలా దట్టించారు. మోడీ హిందీలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ అనువాదంలో మోడీ అనని మాటలను కూడా చేర్చారు.
‘యహా కే లోగ్ రాజ్య సర్కార్ సే ఇత్నా ఆక్రోశ్ హై కీ ఉసే హఠానే కా మన్ కర్ చుకే హై’ (ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆక్రోశంతో ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాని భావిస్తున్నారు) అని నరేంద్ర మోడీ అన్నారు. దానికి పురందేశ్వరి ఘాటైన పదాలను చేర్చారు.
‘ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఉన్నదో దాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని నాకైతే అర్థమవుతున్న విషయం’ అని పురందేశ్వరి అనువాదం చేశారు. ‘అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం’ అనే పదాలను ఆమె అదనంగా చేర్చారు. ‘కూకటివేళ్లతో పెకలించి వేయాలి’ అనే పదాలను కూడా ఆమె అదనంగా చేర్చారు. జగన్‌పై ఆక్రోశంతోనే ఆమె మసాలా దట్టించారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.