అప్పుల కుప్ప ఏపీ.. సింపతీ చూపించిన బీజేపీ
ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు మరే ఇతర రాష్ట్రంలోనూ లేవన్నారు పురందరేశ్వరి. భూములు తనఖా పెట్టి వచ్చిన రుణంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తారా..? అని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం తీసుకునే రుణాల విషయంలో కేంద్రంలోని బీజేపీ కనికరం చూపిస్తోంది, ప్రత్యేక వెసులుబాటు ఇస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ మాత్రం ఏపీ అప్పుల కుప్పలా మారిందంటూ నిందలు వేస్తోంది. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తీసుకున్న పురందరేశ్వరి.. బాధ్యతలు చేపట్టినరోజే వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు, తాజాగా ఆమె సెకండ్ ఎపిసోడ్ మొదలు పెట్టారు. ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఈ పెట్టుబడుల సంగతేమిటి సీఎం @ysjagan గారు? pic.twitter.com/rMXdxj8Fwg
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 19, 2023
ఆదాయాలు.. అప్పులు..
ఏపీ ఆదాయం ఇది, అప్పులివి అంటూ ఆమె ఓ చిట్టా చదివి వినిపించారు పురందరేశ్వరి. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పుని గరిష్ట స్థాయికి తీసుకెళ్లిందని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా షూరిటీగా చూపించి ఏపీ ప్రభుత్వం రూ. 8300 కోట్లు తెచ్చిందని ఆరోపించారామె. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రూ. 71 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని అన్నారు.
ఏపీకి సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 90 వేల కోట్లు కాగా, డెవల్యూషన్ కింద కేంద్రం రూ. 35 వేల కోట్లు ఇస్తోందని... వీటిలో 40 శాతం వడ్డీలకే కడుతున్నారని చెప్పారు పురందరేశ్వరి. అనధికార అప్పులే రూ. 4 లక్షల కోట్లకు పైగా ఉందని ఆరోపించారు. అనధికార అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. బడుగులకు న్యాయం చేసేందుకే అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అసలు బడుగులకు ఏం న్యాయం చేశారని, ఆస్తులను సృష్టించాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకోవడం దారుణం అన్నారు. భూములు తనఖా పెట్టి వచ్చిన రుణంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తారా..? అని ప్రశ్నించారు.
ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు మరే ఇతర రాష్ట్రంలోనూ లేవన్నారు పురందరేశ్వరి. ఆర్థికపరమైన వ్యవహరాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందన్నారు. ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారామె.
త్వరలో పవన్ తో భేటి..
ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షం అని స్పష్టం చేసిన పురందరేశ్వరి.. త్వరలో పవన్ తో భేటీ అవుతామన్నారు. ఇప్పటికే పవన్.. నాదెండ్ల మనోహర్ తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు పురందరేశ్వరి.