నాకే టికెట్ ఇస్తారు.. ఎమ్మెల్యే అయిపోతాను.. ఆశల పల్లకీలో ఏపీ బీజేపీ నేతలు
గతంలో తాము గెలిచిన తాడేపల్లిగూడెం కోసం కూడా బీజేపీ పట్టుబడుతోంది. ఇక్కడ జనసేనకు బలమైన అభ్యర్థి ఉన్నందున పక్కనున్న ఉంగుటూరు తీసుకోమని జనసేన రిక్వెస్ట్ చేస్తోంది.
ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరికను ఆ పార్టీ నాయకుల కంటే బీజేపీ నేతలే ఎక్కువ బలంగా కోరుకున్నారు. ఒంటరిగా పోటీచేస్తే కౌన్సిలర్‌గా కూడా గెలవలేని బీజేపీకి పొత్తులో ఐదో, పదో సీట్లిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవచ్చని బీజేపీ నేతల ఆశ. అందుకే పొత్తు ఖరారవ్వగానే తమకో టికెట్ అంటూ వినతిపత్రాలతో రెడీ అవుతున్నారు. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి నుంచి జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి వరకు అందరూ టికెట్.. టికెట్ అని కలవరిస్తున్నారు.
విశాఖ నార్త్ నుంచి 2014లో ఇదే పొత్తులో గెలిచిన విష్ణుకుమార్ రాజు తాను మళ్లీ ఎమ్మెల్యేగా నిలబడతానని, పొత్తును జనం కూడా కోరుకుంటున్నారని వారం క్రితమే చెప్పేశారు. ఈసారీ ఆయనకు పొత్తులో విశాఖ నార్త్ ఖాయం కావచ్చు. 2014లో విశాఖతోపాటు తాడేపల్లిగూడెం, కైకలూరుల్లోనూ బీజేపీ గెలిచింది. అందుకే ఆ స్థానాలు మాకు కావాలని బీజేపీ లీడర్లు అడుగుతున్నారు. కైకలూరు సీటిస్తే పోటీకి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రెడీ అంటున్నారు.
గూడెం కావాలంటున్న బీజేపీ
గతంలో తాము గెలిచిన తాడేపల్లిగూడెం కోసం కూడా బీజేపీ పట్టుబడుతోంది. ఇక్కడ జనసేనకు బలమైన అభ్యర్థి ఉన్నందున పక్కనున్న ఉంగుటూరు తీసుకోమని జనసేన రిక్వెస్ట్ చేస్తోంది. తాడేపల్లిగూడెం టికెటిస్తే మాజీ మున్సిపల్ ఛైర్మన్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఈతకోట తాతాజీ, ఎప్పటి నుంచో పార్టీలో పాతుకుపోయి ఉన్న భోగిరెడ్డి ఆదిలక్ష్మిల పేర్లు వినపడుతున్నాయి. అదే ఉంగుటూరు అయితే పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణికి ఇచ్చే అవకాశాలున్నాయి. ఆమె పురందేశ్వరికి సన్నిహితురాలని ప్రచారంలో ఉండటంతో ఆమెకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
తిరుపతిలో కిరణ్ రాయల్, శ్రీకాళహస్తిలో కోలా ఆనంద్
తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ టికెట్ ఆశిస్తున్నారు. తిరుపతి ఇవ్వకపోతే కాళహస్తి అడుగుదామని అక్కడి నేత కోలా ఆనంద్ ప్రయత్నిస్తున్నారు. ఇక జమ్మలమడుగులో పోటీకి ఆదినారాయణరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయో, ఏ సీట్లు వస్తాయో తెలియదుగానీ బీజేపీ నేతలు మాత్రం పొత్తులో ఎమ్మెల్యే అయిపోవచ్చని ఆశల పల్లకీలో ఊరేగిపోతున్నారు.