ఒక్క ఛాన్స్.. ఏపీలో ఒంటరిగానే పోటీకి బీజేపీ రెడీ..?
ఏపీలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాలు ప్రారంభించాలని కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు ప్రారంభించబోతున్నారు.
ఏపీలో ఒక్కసారి.. కేంద్రంలో మరోసారి.. ఏపీ బీజేపీ పేరుతో రాష్ట్రంలో వెలిసిన ఈ పోస్టర్లు బోల్డన్ని రాజకీయ పరిణామాలను తెరపైకి తెచ్చాయి. వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నానని పదేపదే ప్రకటిస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ ఈ పోరులో బీజేపీని కలిసి వస్తుందని గంపెడాశలు పెట్టేసుకున్నారు. జనసేన మిత్రపక్షమే అంటున్న బీజేపీ మాత్రం టీడీపీతో కలిస్తే మాత్రం ఆ కూటమిలో చేరేందుకు సుముఖంగా లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఒంటరి పోటీకి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలిస్తోంది.
లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు
ఏపీలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాలు ప్రారంభించాలని కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు ప్రారంభించబోతున్నారు. గురువారమే చాలాచోట్ల ప్రారంభించారు కూడా. ఆయా నియోజకవర్గాల వారీగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా దృష్టిపెట్టారు. దరఖాస్తులు చేసుకోవాలని నేతలకు సూచించారు.
టీడీపీతో కలవబోమని జనసేనకు చెప్పేసినట్టేనా?
టీడీపీతో తాము కలిసేది లేదని బీజేపీ చెబుతోంది. కానీ, చంద్రబాబుకు ఇంకా ఎక్కడో బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశ. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెబుతూ వచ్చారు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైనట్లే. టీడీపీతో కలవబోమని జనసేనకు చెప్పేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.