పార్టీ నిధులు స్వాహా..! ఏపీ బీజేపీ నేతల చేతివాటం
పార్టీ నిధుల దుర్వినియోగం అనే అంశం బయటపడితే అది పార్టీకే మచ్చ. అందుకే ఆ విషయంలో నాయకులు సైలెంట్ గా ఉన్నారు. నిధుల రికవరీకోసం పాత కార్యవర్గం కూడా సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ నేతలపై అతి పెద్ద ఆరోపణ ఇది. పార్టీ నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు మీడియాలో ఓ వర్గం ఈ వ్యవహారాన్ని హైలైట్ చేసింది. మొత్తం రూ.15కోట్ల వరకు దుర్వినియోగం చేసినట్టు ఆ కథనం సారాంశం. పార్టీ నిధులకు సామాన్య ప్రజలకు సంబంధం లేకపోయినా ఏపీ బీజేపీ నేతలు ఎంత ఆకలిమీద ఉన్నారో ఈ వ్యవహారంతో తేలిపోయింది. సొంత పార్టీ నిధులు ఖర్చు చేయడంలో కూడా కోట్ల రూపాయల్లో చేతివాటం ప్రదర్శించడంతో ఏపీ బీజేపీ పరువు బజారున పడినట్టయింది.
ఉప ఎన్నికల పేరుతో నిధుల మేత
ఏపీలో ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా బీజేపీ పోటీకి ఉత్సాహం చూపించేది. కనీసం డిపాజిట్లు రాని ఎన్నికల్లో కూడా కేంద్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయించేది. ఇక రాష్ట్రంలో పార్టీ నాయకులంతా ఆ నియోజకవర్గంలోనే మోహరించేవారు. తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. జనసేనకు కూడా టికెట్ ఇవ్వకుండా బీజేపీయే పోటీ చేయడానికి అసలు కారణం నిధుల మేత అనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీకి కేంద్ర నాయకత్వం కోట్ల రూపాయల నిధులు పంపించినా, వాటిని కింది స్థాయి నేతలు స్వాహా చేసేవారు. అరకొరగా ఖర్చు చేసి భారీగా లెక్కలు చూపేవారట. ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయి.
పార్టీ నిధుల దుర్వినియోగం అనే అంశం బయటపడితే అది పార్టీకే మచ్చ. అందుకే ఆ విషయంలో నాయకులు సైలెంట్ గా ఉన్నారు. విజయవాడకు చెందిన ఓ నాయకుడు 20లలక్షల రూపాయలు వాడేసుకుని ఆరోపణలు రావడంతో కొత్త అధ్యక్షురాలు పురందరేశ్వరికి తిరిగి చెల్లించినట్టు సమాచారం. నిధుల రికవరీకోసం పాత కార్యవర్గం కూడా సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు విజయవాడలో కొత్త కార్యవర్గం సమావేశం కాబోతోంది. ఏపీ బీజేపీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.