Telugu Global
Andhra Pradesh

సోము వీర్రాజుపై తప్పుడు వార్తలు.. అసలు కారణం అదే అంటున్న బీజేపీ నేతలు

బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌పై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండి పడింది. అసలు కోర్ కమిటీ భేటీలో మీడియానే లేనప్పుడు.. ఆ మాటలు అన్నారని ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోము వీర్రాజుపై తప్పుడు వార్తలు.. అసలు కారణం అదే అంటున్న బీజేపీ నేతలు
X

'ఆప్కా నామ్ క్యా హై'.. ఇవ్వాళ సోషల్ మీడియాలో ఈ మాటలే ట్రెండ్ అవుతున్నాయి. వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గుర్తు పట్టలేదని.. మీ పేరేంటి, ఏం చేస్తుంటారని ప్రశ్నించారని ఒక పత్రిక కథనాన్ని వెలువరించింది. రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో భేటీ అయిన సందర్భంగా మోడీ ఇలా ప్రశ్నించడంతో అందరూ అవాక్కయ్యారని రాసుకొచ్చింది. రాజకీయాలు కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా అని సోము వీర్రాజును అడిగినట్లు కూడా ఆ కథనంలో పేర్కొన్నది. పొద్దటి నుంచి ఇదే వార్త ట్రెండ్ అవుతుండటంతో ఏపీ బీజేపీ ఫైర్ అయ్యింది.

బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌పై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండి పడింది. అసలు కోర్ కమిటీ భేటీలో మీడియానే లేనప్పుడు.. ఆ మాటలు అన్నారని ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోము వీర్రాజు గత 40 ఏళ్లుగా తన లాగే పార్టీకి సేవలు అందిస్తున్నారని మోడీ పొగిడిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి అక్కడ చంద్రబాబుపై చర్చ జరిగింది. అది జనాల్లోకి వెళితే బాబు ఇమేజీ డ్యామేజ్ అవుతుందనే ఇలా తప్పుడు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని అంటున్నారు.

కోర్ కమిటీ భేటీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ ఎంపీలు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బలహీనపడిందని తెలిపినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బాబు వయసు మీరుతున్నారని, ఇక ఆయన కొడుకు లోకేశ్‌కు అంత సామర్థ్యం లేదని వాళ్లు మోడీకి వివరించినట్లు సమాచారం. గతంలో డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ఎలా వాడుకున్నారో కూడా మోడీకి చెప్పారు. ఇవన్నీ వదిలేసి 'సోము వీర్రాజును పేరు అడిగారు'అంటూ కొంత మంది బీజేపీ కోవర్టులే వార్తలు రాయించారని పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

బీజేపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారనే సంగతి మరోసారి నిజమైందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్లే రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోతున్నదని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా గుర్తు పట్టలేని స్థితిలో మోడీ లేరని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు రాసిన సదరు పత్రికపై కేసు వేస్తామని చెప్పకొచ్చారు. చంద్రబాబు గురించి అన్న మాటలను బయటకు చెప్పకుండా.. ఇలాంటి తప్పుడు వార్తలతో ఇంకా ఎంత కాలం ప్రజలను మభ్యపెడతారని మండి పడుతున్నారు.

First Published:  13 Nov 2022 2:04 PM IST
Next Story