విను, వినవయ్యా.. స్పీకర్ కి కోపమొచ్చింది
తమ గ్రామంలో మౌలిక వసతులు లేవని కొంతమంది గ్రామస్తులు ఆయనకు విన్నవించారు. నీళ్లు రావడంలేదని చెప్పారు. అయితే తమ్మినేని సమాధానం చెప్పేలోగా స్థానికులు మరిన్ని సమస్యలు చెప్పబోతుండే సరికి ఆయనకు ఆగ్రహం వచ్చింది.
మీరు వినండి, మీరు కూర్చోండి.. అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ఎంతో మర్యాదగా ప్రవర్తించే స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉన్నట్టుండి కోపమొచ్చింది. విను, వినవయ్యా అంటూ తన నియోజకవర్గంలోని ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. సమస్యలు చెప్పుకోవడంలో కాస్త గట్టిగా మాట్లాడే సరికి స్పీకర్ కోపంతో కేకలేశారు. ముందు తాను చెప్పేది వినాలని మందలించారు. 15రోజ్లులో వారి సమస్య పరిష్కారం చేయలేకపోతే ఆ ఊరికే రానని చెప్పేసి వెళ్లిపోయారు.
ఏం జరిగిందంటే..?
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కుపురంలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు వారు అందుకున్న ప్రభుత్వ పథకాల వివరాల పత్రాలను ఇచ్చారు. కాసేపు కార్యక్రమం బాగానే జరిగినా, ఆ తర్వాతే కలకలం మొదలైంది. తమ గ్రామంలో మౌలిక వసతులు లేవని కొంతమంది గ్రామస్తులు ఆయనకు విన్నవించారు. నీళ్లు రావడంలేదని చెప్పారు. అయితే తమ్మినేని సమాధానం చెప్పేలోగా స్థానికులు మరిన్ని సమస్యలు చెప్పబోతుండే సరికి ఆయనకు ఆగ్రహం వచ్చింది. విను, వినవయ్యా అంటూ వారిని కోపగించుకున్నారు. ఊరిలో వీధి దీపాలు వెలగటం లేదని, తాగునీరు రావడంలేదని కొంతమంది స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
గడప గడప కార్యక్రమాల్లో నాయకులు వైసీపీ సానుభూతి పరులు ఉన్న ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. వైసీపీకి మద్దతిచ్చే వారు, ప్రభుత్వ పథకాల ద్వారా ఎక్కువ లబ్ధిపొందిన కుటుంబాలనే వారు కలుస్తున్నారు. అక్కడక్కడా లెక్క తప్పితే ఇలా నాయకులకు ప్రశ్నలు ఎదురవుతాయి. అప్పుడే ఇలాంటి సమాధానాలు బయటకు వస్తాయి. ఒక్కసారి సోషల్ మీడియాకు ఎక్కితే ఇలాంటి వీడియోలతో మరింత మందికి నాయకుల ఆగ్రహావేశాల గురించి తెలుస్తుంది.