Telugu Global
Andhra Pradesh

ఎవరిమీద ‘అనర్హత’ కత్తి పడుతుందో..?

ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు క్రాస్ ఓటింగ్ చేశారు కాబట్టి వీళ్ళపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది.

ఎవరిమీద ‘అనర్హత’ కత్తి పడుతుందో..?
X

ఎంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత కత్తి పడుతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అన్నీ పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది. విషయం ఏమిటంటే.. ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఎందుకు అనర్హత వేటు వేయకూడదో చెప్పండని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల‌కు స్పీకర్ నోటీసులిచ్చారు. సమాధానం చెప్పటానికి వారంరోజుల గడువిచ్చారు.

ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు క్రాస్ ఓటింగ్ చేశారు కాబట్టి వీళ్ళపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే స్పీకర్ నోటీసులు జారీచేశారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కాబట్టి వీళ్ళకు కూడా స్పీకర్ నోటీసులు జారీచేశారు.

ఇక్కడ విషయం ఏమిటంటే.. విప్ ను ధిక్కరించారని, వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీలో గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు డైరెక్టుగా వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైన వీళ్ళు వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారంతే.

అసెంబ్లీలో కూడా తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని అడిగారే కానీ, తమను వైసీపీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని స్పీకర్ ను కోరలేదు. అందుకనే వీళ్ళపై అనర్హత వేటుపడే అవకాశాలు తక్కువ. కానీ, వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆనం తప్ప మిగిలిన ముగ్గురు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పేసుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అడిగే నైతికత టీడీపీకి లేనేలేదు. ఎలాగంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున‌ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించటం చంద్రబాబుకు బాగా అలవాటే.

First Published:  24 Jan 2024 11:56 AM IST
Next Story