కొత్త నేతలు, సరికొత్త బాధ్యతలు.. నేటినుంచి ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ తాజా సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఆయనతో ఆల్రడీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ అసెంబ్లీ ముఖచిత్రం మారింది. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు కూటమిగా అధికారంలోకి వచ్చాయి. అధికార వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబోతోంది. నేటినుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ మార్పులకు వేదిక అవుతున్నాయి. అరడజను సార్లు ఎమ్మెల్యేలు అయిన సీనియర్ల హడావిడి, కొత్తగా అసెంబ్లీ గేటు దాటి లోపలకు అడుగు పెట్టబోతున్నవారి సందడి.. వెరసి ఈ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.
ఇది లాంఛనమే..
ఏపీ అసెంబ్లీ సమావేశాల తాజా సెషన్ లో రణగొణ ధ్వనులేవీ ఉండవు. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ఘట్టం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. రేపు(శనివారం)తో సభ ముగుస్తుంది. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
పార్టీల బలాబలాలు
టీడీపీ 135
జనసేన 21
వైసీపీ 11
బీజేపీ 8
ఏపీ అసెంబ్లీ తాజా సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఆయనతో ఆల్రడీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అసలు స్పీకర్ ని ఎన్నుకుంటారు. ఈసారి స్పీకర్ పదవి చింతకాయల అయ్యన్నపాత్రుడికి లభిస్తోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయిన తర్వాత సభ వాయిదా పడుతుంది. కొత్తగా ఎన్నికైన వారు, మంత్రి పదవులు పొందినవారు మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. తాము గెలిచినా, పార్టీ అధికారానికి దూరం కావడంతో వైసీపీ టీమ్ 11మంది సభలో కాస్త నిర్వేదంతో ఉండటం సహజం.