Telugu Global
Andhra Pradesh

నాపై 7 కేసులు, నామీద 10, నాకు 20..

సినిమాల్లో ఎప్పుడూ విలన్లతో ఫైటింగ్ చేసే పవన్ కల్యాణ్ కూడా నిజ జీవితంలో ఈ కేసుల వల్ల రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

నాపై 7 కేసులు, నామీద 10, నాకు 20..
X

నామీద 7 కేసులు పెట్టారు సార్..

నా మీద 10 పెట్టారు సార్..

నాపై ఏకంగా 20 అక్రమ కేసులు బనాయించారు..

శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో కేసులు ఉన్నవారు ఓసారి పైకి లేవాలని అన్నారు సీఎం చంద్రబాబు. దాదాపుగా అందరు సభ్యులు పైకి లేచి నిల్చున్నారు. అసెంబ్లీలో కూటమి తరపున గెలిచిన వారిలో 80శాతం మందికి పైగా గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నవారేనని తేల్చి చెప్పారు చంద్రబాబు. తనతోపాటు అందరిపై కేసులు పెట్టారని, నాయకులపై మాత్రమే కాదని, వారి కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారన్నారు. సినిమాల్లో ఎప్పుడూ విలన్లతో ఫైటింగ్ చేసే పవన్ కల్యాణ్ కూడా నిజ జీవితంలో ఈ కేసుల వల్ల రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. దీంతో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

పెళ్లి శుభలేఖ ఇస్తూ ఆహ్వానించినట్టుగా సకుటుంబ సపరివార సమేతంగా కేసులు పెట్టారని అన్నారు సీఎం చంద్రబాబు. జగన్ కేసులు పెట్టి వేధించాలనుకుంటే ప్రజలు వారందర్నీ అసెంబ్లీకి పంపించారని చెప్పారు. తనపై ఏకంగా 20కేసులు పెట్టారని నారా లోకేష్ చెప్పారు. అసెంబ్లీలో జరిగిన సన్నివేశాన్ని ఆయన ట్వీట్ ద్వారా మరోసారి గుర్తు చేశారు.


కేసులు లేనివారిని కూడా ఓసారి పైకి లేచి నిల్చోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. కేసులు లేనివారు అదృష్టవంతులని అన్నారు. వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణతోపాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడిపై కూడా కేసులు పెట్టారని, సీఐడీ విచారణ పేరుతో వేధించారని గుర్తు చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు విషయాన్ని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసుల సందర్భంలో సభలోని సభ్యులంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు.

First Published:  25 July 2024 12:59 PM GMT
Next Story