Telugu Global
Andhra Pradesh

బాబు, పవన్ కి కూడా ఓటమి తప్పదన్న రేస్ సర్వే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా రేస్ కరెక్ట్ గా అంచనా వేయడంతో.. ఏపీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

బాబు, పవన్ కి కూడా ఓటమి తప్పదన్న రేస్ సర్వే..
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రకరకాల సర్వేలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రామాణిక సర్వేల్లో దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయం అని తెలుస్తోంది. కూటమి గట్టి పోటీ ఇస్తుందని కూడా ఎవరూ చెప్పడంలేదు. తాజాగా రేస్ సంస్థ సర్వే వైసీపీ గెలుపుని ఖాయం చేస్తూ చంద్రబాబు, పవన్ కి కూడా ఓటమి తప్పదని తేల్చేసింది. ఈ సర్వే ఫలితాలను వైసీపీ అధికారికంగా ప్రచారంలోకి తేవడం విశేషం.


ఏపీ లో మళ్లీ వైసీపీదే విజయం అంటూ రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే తేల్చింది. అయితే వైసీపీకి గతంకంటే కాస్త సీట్లు తగ్గుతాయని స్పష్టం చేసింది. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 132-138 స్థానాల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించబోతుందని తేల్చింది రేస్ సంస్థ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా రేస్ కరెక్ట్ గా అంచనా వేయడంతో.. దీనిపై వైసీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఏపీలో కూడా ఈ సంస్థ సర్వే కచ్చితంగా నిజమవుతుందని అంటోంది.

కుప్పంలో వరుసగా చంద్రబాబు మెజార్టీ తగ్గిపోతూ వస్తోంది. ఈసారి ఆయనకు ఓటమిని పరిచయం చేయాలనుకుంటోంది వైసీపీ. కుప్పంలో కేఎస్ భరత్ ని గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానంటూ ఇప్పటికే సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబుకి చుక్కలు చూపెడుతోంది. అటు పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్ గెలుపు అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతోంది. అది వైసీపీ సిట్టింగ్ సీటు. అయినా కూడా అక్కడ అభ్యర్థిని మార్చారు జగన్. ఎంపీ వంగా గీతకు అక్కడ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో చెమటోడుస్తున్నా కూడా విజయం అంత తేలిగ్గా వరించదని అంటున్నారు. స్థానికంగా టీడీపీ ఓటు బ్యాంక్ జనసేనకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు లేవు. అటు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ ఓటమి కోసం.. వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాపు ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కే పడతాయనే అంచనాలు కూడా లేవు. ఈ దశలో రేస్ సర్వే ఇప్పుడు పిఠాపురంలో పవన్ ఓటమి తప్పదని బాంబు పేల్చింది. ప్రస్తుతం రేస్ సర్వే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

First Published:  20 April 2024 3:32 PM IST
Next Story