ఐదోరోజుకి అంగన్వాడీల సమ్మె.. బెట్టు వీడని జగన్
అంగన్వాడీ కేంద్రాలు మూసివేసి సిబ్బంది సమ్మెకు దిగడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాలంటీర్లతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వాలు చాలా ఉదారంగా ఉంటాయి. వివిధ వర్గాల కోర్కెలన్నీ నెరవేర్చేందుకు ఏమాత్రం మొహమాటపడవు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకో అంగన్వాడీల విషయంలో కాస్త కఠినంగానే ఉంది. అంగన్వాడీలతో వరుసగా జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో సమ్మె ఐదోరోజుకి చేరింది. అటు ప్రతిపక్షాలు ఈ సమ్మెకు మద్దతిస్తూ వారిని మరింత రెచ్చగొడుతున్నాయి.
అంగన్వాడీల సమస్యలేంటి..?
జీతాల పెంపు అనేది వారి ప్రధాన డిమాండ్. దానితోపాటు మొత్తం 11 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు తమ జీతాలు పెంచాలని వారు కోరుతున్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.26 వేలు, హెల్పర్లకు రూ.20 వేలుగా జీతాలను పెంచాలని ఆందోళన చేస్తున్నారు. గ్రాట్యుటీ విషయంలో కూడా తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది..?
ప్రభుత్వం తరపున మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. మూడు విడతలుగా చర్చలు జరిపినా జీతాలు పెంచే విషయంలో మాత్రం వారు హామీ ఇవ్వలేదు. కొన్ని డిమాండ్లను నెరవేరుస్తామని మాత్రమే చెబుతున్నారు నేతలు. దీనికి అంగన్వాడీలు ఒప్పుకోవడంలేదు.
ప్రత్యామ్నాయం ఏంటి..?
అంగన్వాడీ కేంద్రాలు మూసివేసి సిబ్బంది సమ్మెకు దిగడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాలంటీర్లతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొన్నిచోట్ల అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిమరీ స్వాధీనం చేసుకున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారమే అయినా.. అటు ప్రభుత్వం, ఇటు అంగన్వాడీలు బెట్టు వీడక పోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. సమ్మె ఐదోరోజుకి చేరుకుంది.