ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు
చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే.. రాష్ట్ర ప్రజలు, యువత ఆయన్ని ఎందుకు తరిమేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరిలో చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు.. డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారని మండిపడ్డారు. చప్పట్లు కాదు.. చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం, నీతి నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.
చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే.. రాష్ట్ర ప్రజలు, యువత ఆయన్ని ఎందుకు తరిమేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు. తమ ప్రభుత్వ పథకాలను పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న వాటిని.. కాపీ కొట్టాలనుకునే దౌర్భాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. మోసానికి, అవినీతికి బాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
రాజకీయాల్లో తన అవినీతి మీద సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా అని మంత్రి కాకాణి సూటిగా ప్రశ్నించారు. కోర్టులకి వెళ్లడం.. స్టే తెచ్చుకోవడం చంద్రబాబు అవినీతికి పరాకాష్ట అని మండిపడ్డారు. స్కిల్ స్కాం, ఔటర్ రింగ్ రోడ్ మీద సీబీఐ విచారణ కోరి చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు బలహీనుడు, అసమర్థుడు, రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి అని విమర్శించారు.