ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా పరీక్షలను మార్చిలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి బొత్స చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా టెన్త్, ఇంటర్ పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు 16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా పరీక్షలను మార్చిలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షల సమయంగా నిర్ణయించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25వ తేదీ వరకు, థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1
19న సెకండ్ లాంగ్వేజ్
20న ఇంగ్లిష్
22న మ్యాథ్స్
23న ఫిజికల్ సైన్స్
26న బయాలజీ
27న సోషల్ స్టడీస్
28న మొదటి లాంగ్వేజ్ పేపర్ -2
30న మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, వొకేషనల్ కోర్సు పరీక్షలు