భారీ వడ్డీ ఆశ చూపి.. కోట్లలో దోచేశారు..! - డిపాజిటర్లకు టోకరా వేసి బోర్డు తిప్పేసిన కంపెనీ
లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. అది కూడా వారానికి రూ.10 వేలు చొప్పున తీసుకెళ్లొచ్చని చిత్తూరులోని ఏవోజీ అనే కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. ఆ కంపెనీ మాయమాటలు నమ్మిన పలువురు రూ.కోట్లలో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో గుండెలు బాదుకుంటున్నారు.
భారీ వడ్డీ వస్తుందనే ఆశతో ఓ కంపెనీలో డబ్బు జమచేసిన డిపాజిటర్లకు షాక్ తగిలింది. కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన కంపెనీ బోర్డు తిప్పేయడంతో దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఇప్పుడు జనం పోలీస్ స్టేషన్‌కి క్యూ కడుతున్నారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వన్‌టౌన్ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. అది కూడా వారానికి రూ.10 వేలు చొప్పున తీసుకెళ్లొచ్చని చిత్తూరులోని ఏవోజీ అనే కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తోంది. మూడేళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెబుతోంది. అందుకు సంబంధించి బాండ్ కూడా అందిస్తోంది. తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని.. నాలుగో నెల నుంచి మొత్తం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఆ కంపెనీ మాయమాటలు నమ్మిన పలువురు రూ.కోట్లలో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో గుండెలు బాదుకుంటున్నారు.
ఎలా బయటపడిందంటే..
చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనూరాధ ఓ బ్యూటీషియన్. కొంగారెడ్డిపల్లిలో ఆమె విధులు నిర్వహిస్తోంది. చిత్తూరులోని ఏవోజీ అనే కంపెనీలో డిపాజిట్ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ ఆమె బంధువు చెప్పడంతో ఆ కంపెనీకి వెళ్లింది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రూ.40 వేలు వడ్డీ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పిన వివరాలతో ఆమెకు ఆశ కలిగింది.
అప్పు చేసి మరీ..
అనుకున్నదే తడవుగా తన వద్ద ఉన్న సొమ్ముతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టింది. సమీప బంధువుల వద్ద అప్పు చేసి మరీ మరికొంత సొమ్ము పోగు చేసింది. మొత్తం కలిపి రూ.45 లక్షలు ఏవోజీ కంపెనీలో డిపాజిట్ చేసింది. అనంతరం మూడు నెలల తర్వాత వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళితే.. దాని జాడే లేదు. కంపెనీ బోర్డు తిప్పేసిందని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మరింత మంది రూ.కోట్లలో...
ఈ కంపెనీలో మరింత మంది కోట్ల రూపాయల మేరకు డిపాజిట్లు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ బోర్డు తిప్పేసిన విషయం ఇంకా తెలియనివారు డిపాజిట్లపై వడ్డీ వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీసుల వరకు రావడంతో బాధితులంతా వరుసగా పోలీస్‌స్టేషన్‌కు క్యూకట్టే అవకాశముంది.