Telugu Global
Andhra Pradesh

జగన్ కి వ్యతిరేకంగా విశాఖలో ఫ్లెక్సీలు..

గతంలో కూడా సీఎం గో బ్యాక్ అంటూ జన జాగరణ సమితి పేరుతో విశాఖలో ఫ్లెక్సీలు కనిపించాయి. అప్పట్లో ఆ సమితి నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే పేరుతో ఫ్లెక్సీలు పెట్టడంతో కలకలం రేగింది.

జగన్ కి వ్యతిరేకంగా విశాఖలో ఫ్లెక్సీలు..
X

ఏపీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జనజాగరణ సమితి పేరుతో నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మధురవాడ ఐటీ హిల్స్, విశాఖ-భీమిలి మార్గంలో ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ పర్యటనకి ముందురోజు, ఆయనకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వాటిని తొలగించేలోపే అవి మీడియాలో హైలెట్ కావడంతో స్థానిక నేతలు తలలు పట్టుకున్నారు.

ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన ఇలా..

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. రామతీర్థసాగర్‌ ప్రాజెక్టు పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. దీనికి గతంలోనే శంకుస్థాపన జరిగిందని, మరోసారి ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు శిలాఫలకం వేస్తారు. మధురవాడలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌(అదానీ డేటా సెంటర్‌)కు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. కీలక కార్యక్రమాలకోసం జగన్ విశాఖ వస్తున్న సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం సంచలనంగా మారింది. గతంలో కూడా సీఎం గో బ్యాక్ అంటూ జన జాగరణ సమితి పేరుతో విశాఖలో ఫ్లెక్సీలు కనిపించాయి. అప్పట్లో ఆ సమితి నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే పేరుతో ఫ్లెక్సీలు పెట్టడంతో కలకలం రేగింది.

విశాఖలో నిరసన ఎందుకు..?

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్, త్వరలోనే తన కాపురం అక్కడ పెడతానన్నారు. అయినా కూడా ఉత్తరాంధ్ర నుంచి పెద్దగా అనుకూల స్పందన లేదు. నాయకులు ఆహా ఓహో అనుకుంటున్నారు కానీ, రాజధాని తరలింపు హడావిడి మాత్రం లేదు. రాజధాని నిర్ణయంతో విశాఖ వాసులు సంబరపడాలి కానీ, ఇలా వ్యతిరేకంగా బ్యానర్లు కట్టడమేంటో అర్థం కావడంలేదు. రెండుమూడు చోట్ల వేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయంగా పరిగణలోకి తీసుకోలేం కానీ.. జగన్ పర్యటన ముందు ప్రతిసారీ ఇలాంటివి జరగడం విశాఖలో సహజం కావడం విశేషం.

First Published:  2 May 2023 1:40 PM IST
Next Story