టీడీపీలో మరో విషాదం.. ప్రచార కార్యక్రమాల్లో ఆగిన గుండె
శనివారం మధ్యాహ్నం వరకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రత్తిపాడుకి వచ్చి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. తనకు గుండెనొప్పిగా ఉందని ఒక్కసారిగా కుప్పకూలారు.
బచ్చుల అర్జునుడు మరణం తర్వాత టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్న ఆయన ఉన్నట్టుండి చనిపోవడంతో టీడీపీ నేతలు షాక్ కి గురయ్యారు.
ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి చిరంజీవిరావు తరపున ఇటీవల ప్రచారంలో పాల్గొంటున్నారు రాజా. సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల పార్టీ అబ్జర్వర్ గా ఉన్న ఆయన. శనివారం మధ్యాహ్నం వరకు ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రత్తిపాడుకి వచ్చి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. తనకు గుండెనొప్పిగా ఉందని ఒక్కసారిగా కుప్పకూలారు. ఆక్కడే ఉన్న పార్టీ నాయకులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేదు. రాజా మృతి చెందారు.
వరుపుల రాజా తాత జోగిరాజు, చిన తాత సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యేలుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుపుల రాజా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆప్కాబ్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2019లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. రాజా మరణం పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం తెలిపారు. . రాజా మృతి పార్టీ కి తీరని లోటు అన్నారు చంద్రబాబు, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందన్నారు నారా లోకేష్. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందని ట్వీట్ చేశారు.
ఆత్మీయ స్నేహితుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసింది. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయింది. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టిడిపికి తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. pic.twitter.com/St8dnTIM74
— Lokesh Nara (@naralokesh) March 5, 2023