టీడీపీకి మళ్లీ రాజధాని స్ట్రోక్
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్నే అమరావతివాదులు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు సీఆర్‌డీఏ చట్టంలో తెచ్చిన సవరణ ఆధారంగా అమరావతిలో ఇళ్ల స్థలాలు పొందేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పేదలు అర్హులే.
అమరావతిలో చుట్టు పక్కల గ్రామాలతో పాటు విజయవాడలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గతంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా అమరావతి వాదులు హైకోర్టుకు వెళ్లారు. రాజధాని ప్రాంతంలో బయటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకు వెళ్లగా సీఆర్‌డీఏ చట్టం ప్రకారం బయటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదంటూ హైకోర్టు కూడా అమరావతి వాదులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ వ్యవహారంలో అడ్డంకులను ఛేదించేందుకు జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త మార్పులు తెచ్చింది. పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అడ్డంకిగా ఉన్న సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్లలో సవరణలు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం.
ఇదివరకు రాజధాని 29 గ్రామాలకు ఆనుకుని ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్నే అమరావతివాదులు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు సీఆర్‌డీఏ చట్టంలో తెచ్చిన సవరణ ఆధారంగా అమరావతిలో ఇళ్ల స్థలాలు పొందేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పేదలు అర్హులే. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల ప్రజలకు మాత్రమే సొంతం కాదని, ఇక్కడ అందరికీ హక్కులుంటాయని సవరణ తీసుకొచ్చింది.
ఇది వరకు సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని పర్‌ఫెక్టివ్ ప్లాన్‌ని పదేళ్ల వరకు, మాస్టర్ ప్లాన్‌ను 30ఏళ్ల వరకు మార్చడానికి వీల్లేదు. తాజా సవరణలతో సీఆర్‌డీఏ చట్టంలో ఇకపై మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇకపై స్థానిక సంస్థల నుంచి ప్రతిపాదన వచ్చినా, ఎన్నికలు నిర్వహించని గ్రామాల్లో ప్రత్యేకాధికారి నుంచి ప్రతిపాదన వచ్చినా వాటి ఆధారంగా పరిశీలన చేసి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం వస్తుంది.