కూటమిలో పవన్ హోదా ఏంటో తేలాల్సిందే.. హరిరామజోగయ్య మరో లేఖ
కూటమిలో పవన్ స్థానం పక్కదారి పడుతోందని.. పవన్, చంద్రబాబుల పాత్ర ఏంటో స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందని జోగయ్య పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన కూటమిలో పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటి, ఆయన హోదా ఏమిటనేది కచ్చితంగా తేలాల్సిందేనని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య అన్నారు. ఎప్పటికప్పుడు తన లేఖల ద్వారా తన అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించే హరిరామజోగయ్య ఈసారి ఘాటు లేఖాస్త్రమే సంధించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ, జనసేన కూటమి బహిరంగసభలో ఈ విషయంపై రెండు పార్టీల అధినేతలూ స్పష్టత ఇవ్వాల్సిందే అని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. చంద్రబాబు గనుక ఈ అంశంలో స్పష్టత ఇవ్వకుంటే ఈ నెల 29న తన నిర్ణయం ప్రకటిస్తానని కూటమికి అల్టిమేటం జారీ చేశారాయన.
పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకుని నమ్మినవారిని నట్టేట ముంచాడనే విమర్శ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన తీరని ద్రోహం చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. మొదటి నుంచి సీట్ల విషయంలో తగ్గొద్దంటూ లేఖల ద్వారా సలహాలు ఇస్తూ వస్తున్న హరిరామ జోగయ్య.. ఈసారి తన లేఖను ఘాటుగానే సంధించారు. టీడీపీ–జనసేన పొత్తు.. సీట్ల పంపకం.. చూశాక బడుగులకు రాజ్యాధికారం పక్కదారి పడుతుందేమోనని అనిపిస్తోందని ఆయన తన లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. అసలు బడుగు, బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని, ఇందుకు తాడేపల్లిగూడెంలో జరగబోయే సభలో ఇరు పార్టీల నేతలు స్పష్టత ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేశారు.
అంతేకాదు.. కూటమిలో పవన్ స్థానం పక్కదారి పడుతోందని.. పవన్, చంద్రబాబుల పాత్ర ఏంటో స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందని జోగయ్య పేర్కొన్నారు. అంతేకాదు.. అధికారంలో సగం వాటా జనసేనకు దక్కాలని.. గౌరవప్రదమైన హోదాలో పవన్ పదవి దక్కించుకోవాలని, బడుగు, బలహీనవర్గాల సర్వాధికారాలు పవన్‌కు దక్కాలని కాపు నేత జోగయ్య ఆకాంక్షించారు.