Telugu Global
Andhra Pradesh

తిరుమలలో అలర్ట్.. బోనులో మరో చిరుత..

మరిన్ని చిరుతలు అక్కడ సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు మరో చిరుతను పట్టేశారు. గత 50 రోజుల వ్యవధిలో టీటీడీ ఏకంగా 3 చిరుతలను బంధించడం విశేషం.

తిరుమలలో అలర్ట్.. బోనులో మరో చిరుత..
X

ఆరేళ్ల పాపపై చిరుత దాడి అనంతరం టీటీడీ అప్రమత్తమైంది. చిరుత సంచారంపై అనుమానం ఉన్న ప్రాంతాలన్నిటిలో బోనులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పాపపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడు మరో చిరుత బోనులో చిక్కడం విశేషం. మూడు రోజుల వ్యవధిలోనే మరో చిరుత బోనులో పడటంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ చిరుతను కూడా తిరుపతి ఎస్వీ జూ పార్క్ కి తరలించారు. మోకాలి మిట్ట, లక్ష్మీ నరశింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేయగా, లక్ష్మీనరసింహ‌ స్వామి ఆలయం వద్ద బోనులో చిరుత చిక్కింది.

50రోజుల వ్యవధిలో మూడోది..

గతంలో ఓ బాలుడిపై దాడి చేసిన చిరుతను వెంటనే బోనులో బంధించారు టీటీడీ అధికారులు. అయితే దాన్ని అడవిలో వదిలేశారు. ఈసారి చిరుత దాడిలో ప్రాణం పోయే సరికి.. మరోసారి బోనులు పెట్టి చిరుతను బంధించి జూ పార్క్ కి తరలించారు. ఈ క్రమంలో మరిన్ని చిరుతలు అక్కడ సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు మరో చిరుతను పట్టేశారు. గత 50 రోజుల వ్యవధిలో టీటీడీ ఏకంగా 3 చిరుతలను బంధించడం విశేషం.

మళ్లీ భయం భయం..

మెట్ల మార్గంలో దాడి తర్వాత చిరుతను బంధించారనే వార్తలతో భక్తుల్లో భయాందోళనలు తగ్గిపోయాయి. మరిన్ని చిరుతల సంచారం ఉంది అని తెలిసినా కూడా ఎవరూ పెద్దగా ఆందోళన చెందిన దాఖలాలు లేవు. పైగా సెక్యూరిటీ పెంచి, భక్తుల్ని గుంపులు గుంపులుగా కొండపైకి పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో చిరుత బోనులో చిక్కడంతో భయాందోళనలు పెరిగాయి. ఇంకెన్ని చిరుతలు ఉంటాయో అనే అనుమానం బలపడుతోంది.

First Published:  17 Aug 2023 7:00 AM IST
Next Story