Telugu Global
Andhra Pradesh

అన్న‌వ‌రం కొండ‌పై ప్లాస్టిక్‌కి చెక్‌.. రేప‌టి నుంచే అమ‌లు

గాజు సీసాలో 750 మిల్లీ లీట‌ర్ల నీటిని కూలింగ్ చార్జీతో క‌లిపి రూ.60కి విక్ర‌యిస్తార‌ని, నీటిని వినియోగించుకున్న అనంత‌రం ఖాళీ బాటిల్‌ని తిరిగి దుకాణంలో ఇస్తే రూ.40 వెన‌క్కి ఇచ్చేస్తార‌ని తెలిపారు.

అన్న‌వ‌రం కొండ‌పై ప్లాస్టిక్‌కి చెక్‌.. రేప‌టి నుంచే అమ‌లు
X

అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ‌స్వామి ఆల‌య కొండ‌పై ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడుతున్నారు. అన్న‌వ‌రం కొండ‌పై మంగ‌ళ‌వారం నుంచి దీనిని అమ‌లులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు ఆల‌య ఈవో ఆజాద్ వెల్ల‌డించారు. కొండ‌పై ఉన్న దుకాణాల్లో తాగునీటిని సైతం గాజు, మొక్క‌జొన్న గింజ‌ల‌తో త‌యారుచేసే సీసాల్లో మాత్ర‌మే విక్ర‌యిస్తార‌ని వివ‌రించారు. గాజు సీసాలో 750 మిల్లీ లీట‌ర్ల నీటిని కూలింగ్ చార్జీతో క‌లిపి రూ.60కి విక్ర‌యిస్తార‌ని, నీటిని వినియోగించుకున్న అనంత‌రం ఖాళీ బాటిల్‌ని తిరిగి దుకాణంలో ఇస్తే రూ.40 వెన‌క్కి ఇచ్చేస్తార‌ని తెలిపారు.

మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని రూ.40కి విక్రయించేందుకు అనుమతించామ‌ని ఈవో చెప్పారు. కొండపై పలు ప్రదేశాల్లో జల ప్రసాదం ప్లాంట్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. మూత తెరవని శీతల పానీయాల సీసాలు మాత్రమే కొండ పైకి అనుమతిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వాటిలో తాగునీటిని తీసుకురాకుండా తనిఖీలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వివాహాల సమయంలో కూడా ఈ నిబంధనలు అమలవుతాయ‌ని తెలిపారు. ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్రమిస్తే రూ.500 జరిమానా విధిస్తామ‌ని ఈవో స్ప‌ష్టం చేశారు. ఈవో సహా సిబ్బంది అంతా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

కాకినాడ జిల్లా అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ‌స్వామి దేవ‌స్థానానికి నిత్యం భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం కోసం వ‌చ్చేవారి సంఖ్య నిత్యం ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో అయితే అన్న‌వ‌రం కొండ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంది. తాజాగా నిబంధ‌న‌ల‌తో భ‌క్తులు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌తో ఆల‌యానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

First Published:  14 Aug 2023 7:55 AM IST
Next Story