అక్కడ అన్న క్యాంటీన్.. స్పందన ఎలా ఉందంటే..?
అన్న క్యాంటీన్ల ఏర్పాటు తమకు ఎంతో ఉపయోగం అని అంటున్నారు స్థానికులు. రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు, పేద వర్గాలు ఈ క్యాంటీన్ సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి.
వైసీపీ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్ తలుపులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఏపీలో తొలిసారిగా చిత్తూరు నగరంలో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభమైంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తోపాటు స్థానిక నాయకులు, అధికారులు ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్ నిర్వహణతోపాటు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా అందులో ఉంది. ఆ సంతకాలు పూర్తయిన రోజుల వ్యవధిలోనే అన్న క్యాంటీన్లు మళ్లీ మొదలవుతుండటం విశేషం. ఏపీలో అన్న క్యాంటీన్ తిరిగి తెరుచుకున్న తొలి నగరంగా చిత్తూరుకి పేరు దక్కింది.
అన్న క్యాంటీన్ ఏర్పాటు తమకు ఎంతో ఉపయోగం అని అంటున్నారు స్థానికులు. రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు, పేద వర్గాలు ఈ క్యాంటీన్ సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఉదయం టిఫిన్ రూ.5, మధ్యాహ్నం భోజనం రూ.5 కే ఇక్కడ లభ్యమవుతుంది. పరిశుభ్ర వాతావరణంలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. అన్న క్యాంటీన్ల విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాకముందే స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఇక్కడ క్యాంటీన్ ప్రారంభమైంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తిరిగి తెరుస్తారని తెలుస్తోంది.